మన చుట్టూ ఎన్నో రకాల జీవులు ఉంటాయి. అయితే వాటి గురించి తెలియని విషయాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల జంతువులు మనకు నేల పై కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి కేవలం నేలపై నడవడం మాత్రమే కాకుండా నీటి పైన కూడా నడవగలవు. కొన్ని జంతువులు ఎప్పుడైతే నీటిలో పడతాయో అవి మునిగిపోతాయి లేక ఈదుతాయి. కాకపోతే కొన్ని అరుదైన జంతువులు మాత్రం నీటిలో పడిన తర్వాత నీటిపై నడవగలవు. వాటి శరీరంలో ఉండే కొన్ని ప్రత్యేకతల వలన ఆ జంతువులు నీటి పై ఎంతో తేలిగ్గా నడుస్తాయి.
కొన్ని సాలీళ్లు చెరువులు, సరస్సులు దగ్గర్లో నివసిస్తాయి. సాలీళ్లకు పొడవాటి కాళ్లు ఉంటాయి. అంతేకాకుండా వాటికి ఉండే ప్రత్యేకమైన మైనం పూత వలన నీరు అంటుకోదు. ఈ విధంగా నీటి పై ఎంతో తేలిగ్గా నిలబడతాయి మరియు నడుస్తాయి. అంతేకాకుండా సాలీళ్లు నీటిపై ఉండేటువంటి చిన్న కప్పలను, కీటకాలను మరియు చిన్న చేపలను కూడా వేటాడుతాయి. పైగా ఎప్పుడైనా ప్రమాదం ఏర్పడితే నీటిలో మునిగి కొన్ని నిమిషాలు దాక్కుంటాయి. ఈ విధంగా ఎంతో తెలివిగా ప్రవర్తిస్తాయి. ఫైర్ యాంట్స్ కూడా నీటి పై నడవగలవు. ముఖ్యంగా వరదలు వచ్చిన సమయంలో ఈ ఫైర్ యాంట్స్ ఎంతో తెలివిగా వ్యవహరిస్తాయి.
ఒక చీమ శరీరాన్ని మరొకటి పట్టుకొని కలిసికట్టుగా ఒక తెప్ప లాగా ఏర్పడతాయి. ఈ విధంగా చీమలు ఎంతో సురక్షితంగా ఉంటాయి. ఎప్పుడైతే గుంపుగా ఇలా ప్రయాణిస్తాయో, నీటిలో తేలుతూ ఉంటాయి. ఈ ఐకమత్యంతో నీటిలో కూడా ఇవి నడవగలవు. జీసస్ బల్లి నీటి పై కేవలం నడవడం మాత్రమే కాకుండా పరుగు కూడా పెట్టగలదు. అయితే ఈ బల్లులు ఎక్కువగా దక్షిణ అమెరికాలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎంతో వేగంగా వాటి పాదాలను ఉపయోగించి నీటిలో నడుస్తాయి. వేగంగా నడవడం వలన నీటిలో చిన్న గాలి బుడగలు ఏర్పడతాయి మరియు ఆ గాలి బుడగలు సహాయంతో, నీటిలో మునిగిపోకుండా చెరువులు, నదుల పై వేగంగా పరిగెడతాయి.