హోటల్ రూం, ట్రైయల్ రూమ్స్ లో స్పై కెమేరాలు ఉన్నాయో లేదో కనుక్కోవటం ఎలానో తెలుసా.?

-

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది దాని తాలుకూ దుష్పలితాలు కూడా ఎక్కువవుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా మహిళలకు కనీస రక్షణ కరవైన ఈ పరిస్థితుల్లో హాస్టల్, హోటల్, షాపింగ్ మాల్‌లో ట్రయల్ రూమ్.. ఇలా వివిధ ప్రదేశాల్లో స్పై కెమెరాలు ఉంటున్నాయి. వెళ్లే ప్రతిప్రదేశంలో ఉండకపోవచ్చు..మనకు కనీసం అవి ఉన్నాయో లేవో తెలుసుకునే అవగాహన అయితే కచ్చితంగా ఉండాలి కదా… అందుకే కొన్ని చిట్కాలను మీ ముందుకు తీసుకొచ్చాం. వీటి ద్వారా అమ్మాయిలు ముఖ్యంగా మీరు..స్పై కెమెరాలు ఉన్నాయో లేవో తెలుసుకోండి.

స్పై కెమెరాలు కేవలం షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూముల్లో, హోటల్ గదుల్లో, హాస్టళ్లలోనే ఉంటాయని అనుకోకండి.. ఏ ప్రదేశంలోనైనా ఇలాంటివి ఉండే అవకాశాలు లేకపోలేవు. అందుకే మనకు తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు ఎంతో అప్రమత్తంగా మెలగడం చాలా మంచిది. ఈ క్రమంలో ముందుగా మీరు వెళ్లిన ప్రాంతంలోని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. గోడలు, స్విచ్‌బోర్డులు.. మొదలైన వాటికి ఎక్కడైనా చిన్న రంధ్రాలు, నల్లని డాట్స్ వంటివి ఉన్నాయేమో చూసుకోవాలి.

ఎక్కువగా ఇక్కడే ఫిక్స్ చేస్తారు

సాధారణంగా స్పై కెమెరాలను స్మోక్ డిటెక్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు, ఏసీలు, వాల్ పెయింటింగ్స్, పుస్తకాలు, మొక్కలు, బొమ్మలు, లైట్లు, కుషన్లు, అలమరాలు, టిష్యూ బాక్స్‌లు వంటి వాటిలో దాచే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటివి ఉన్నాయా? లేదా? అని జాగ్రత్తగా చూడాలి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే అక్కడి నుంచి బయటకు వచ్చేయటం మంచిది. అలాగే ఏవైనా అవసరం లేని వైర్లు, అడాప్టర్లు వంటివి కనిపిస్తే వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేయండి.

కాల్ చేసి చూడండి.

స్పై కెమెరాలను గుర్తించేందుకు అత్యంత సులువైన ఉపాయం మీ ఫోన్‌ని ఉపయోగించటమే..ట్రయల్ రూమ్‌కి వెళ్లినప్పుడు గానీ, లేదా ఏదైనా కొత్త హోటల్ గదిలో దిగినప్పుడు గానీ అక్కడ రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారో.. లేదో తెలియాలంటే..అక్కడే ఉండి..ఎవరో ఒకరికి ఫోన్ చేయండి. సాధారణంగా స్పై కెమెరాలు ఒక రకమైన రేడియో ఫ్రీక్వెన్సీతో రన్ అవుతుంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ వల్ల మీరు ఫోన్ చేస్తున్నప్పుడు సిగ్నల్ సమస్య వస్తుంది. లేదా ఫోన్ మాట్లాడుతుంటే గరగరమంటూ శబ్దం వినిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్య ఎదురైతే అక్కడ రహస్య కెమెరా ఉన్నట్లు అనుమానించాల్సిందే.

యాప్స్ ద్వారా కూడా..

ఈ తరహా కెమెరాలను గుర్తించేందుకు కొన్ని రకాల యాప్స్‌ని కూడా ఉపయోగించవచ్చు. వైర్‌లెస్ కెమెరా డిటెక్టర్, హిడెన్ కెమెరా డిటెక్టర్ లాంటి యాప్స్ ద్వారా మీ చుట్టుపక్కల ఉన్న వైర్‌లెస్ డివైజెస్ సమాచారం మొత్తం మీ ఫోన్‌లో కనిపిస్తుంది. ఒకవేళ స్పై కెమెరా ఉన్నట్లయితే మీరు అక్కడినుంచి వెళ్లిపోయే వీలుంటుంది.

అద్దం ఇలా ఉండాలి..

చాలామంది స్పై కెమెరాలను అద్దం వెనుకే పెడుతుంటారు. మనం కనిపెట్టలేం కూడా..అంతేకాదు సాధారణ అద్దాలకు బదులుగా టూవే మిర్రర్స్‌ని కూడా కొన్ని ప్రదేశాల్లో అమర్చుతుంటారు. ఇవి మనకు అద్దంలానే కనిపించినప్పటికీ వాటి వెనుక భాగం వైపు ఉన్నవారికి మనం చాలా స్పష్టంగా కనిపిస్తాం. కాబట్టి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఏ తరహా అద్దాలు ఉన్నాయో కూడా ఓసారి సరిచూసుకోవడం మంచిది. ఆ తర్వాతే అక్కడ స్నానం చేయడం లేదా బట్టలు మార్చుకోవడం వంటివి చేయాలి.ఇంతకీ ఈ తరహా అద్దాన్ని ఎలా పరీక్షించాలంటే..

మీ చూపుడువేలు కొసను అద్దానికి ఆనించి ఉంచండి. ఇలా ఉంచినప్పుడు మీ వేలికి అద్దంలో కనిపించే మీ వేలి ప్రతిబింబానికి మధ్య కాస్త గ్యాప్ ఉన్నట్లు అనిపిస్తే అది నిజమైన అద్దం.. అలాకాకుండా మీ వేలికి, దాని ప్రతిబింబానికి మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా రెండూ పరస్పరం తాకుతున్నట్లు కనిపిస్తే అది టూవే మిర్రర్ అయి ఉండచ్చని భావించాలి. అలాగే ఆ అద్దం వెనుక ఎవరైనా స్పై కెమెరా కూడా పెట్టి ఉండచ్చు. కాబట్టి వెంటనే హోటల్ లేదా షాపింగ్‌మాల్ యాజమాన్యానికి దాని గురించి ఫిర్యాదు చేయటం బెటర్.

ఫ్లాష్‌లైట్ వాడితే..

సాధారణంగా స్పై కెమెరాలన్నీ నైట్ విజన్ మోడ్‌వే అయి ఉంటాయి. ఎందుకుంటే చీకట్లోనూ రికార్డ్ చేసేందుకు వీలుగా ఉన్నవాటిని ఉపయోగిస్తారు. అందుకే వీటి నుంచి ఓ చిన్న లైట్‌లాంటిది వస్తుంది. అందుకే మీ గదిలో పూర్తిగా ఏమాత్రం లైట్ లేకుండా చీకటిగా చేయాలి. దీనికోసం కేవలం లైట్లు ఆపేయడమే కాదు.. ఏమాత్రం వెలుతురు రాకుండా కర్టెన్లను కూడా మూసేయాలి. ఎక్కడినుంచైనా చిన్న ఆకుపచ్చ లేదా ఎరుపు లైట్లు వస్తున్నాయేమో అని చెక్ చేసుకోవాలి. మీరు నెట్ మూవి చూసినట్లైతే ఇది బాగా అర్థమవుతుంది. ఆ మూవిలో హీరోయిన్ ఫైనల్ గా స్పై కెమేరాలను ఇలానే పసిగడుతుంది.

ఒక ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి అనుమానాస్పదంగా అనిపించిన ప్రతి ప్రదేశంలోనూ దానిని వేసి చూడండి. సాధారణంగా గోడలు వంటి ఉపరితలాలపై లైట్ వేసినప్పుడు దాని ప్రతిబింబం మన వెనుక కనిపిస్తుంది. కానీ ఫ్లాష్‌లైట్ ప్రతిబింబం మనకు కనిపించకుండా దాని వెలుతురు వస్తువుకు అవతలి వైపు ప్రసరిస్తున్నట్లు కనిపిస్తే తప్పకుండా దాని వెనుక కెమెరా ఉందని అనుమానించవచ్చు. వెంటనే లైట్స్ ఆన్ చేసి అక్కడ ఏముందో ఒకసారి పరీక్షించుకోవాలి.

ఈ చిన్నచిన్న ట్రిక్స్ ఉపయోగించి స్పై కెమేరాలు ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటే..చాలా వరకూ ప్రమాదాల భారిన పడే అవకాశం ఉండదు. ఎవరైన నష్టం జరిగాకే చర్యలు తీసుకుంటారు..కాబట్టి మీరు జాగ్రత్తలు పాటించారంటే…నష్టం జరిగే అవకాశం చాలావరకూ ఉండదుకదా..!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version