భీంరావ్ రాంజీ అంబేద్కర్.. బీఆర్ అంబేద్కర్ గా అందరికీ పరిచయమైన భారత మాత ముద్దుబిడ్డ. భారతదేశానికి స్వతంత్రం కోసం చేసిన పోరాటంలో పాల్గొన్న యోధుడు. భారత రాజ్యానికి రాజ్యాంగాన్ని రాసిన వీరుడు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా పనిచేసిన అంబేద్కర్, ప్రపంచ దేశాల రాజ్యాంగాలని పరిశీలించి, మన దేశంలోని పరిస్థితులకి అవి ఎలా సరిపోతాయి? మనకి ఇంకా ఏమేం అవసరం ఉంటాయని విశ్లేషించుకుని సుదీర్ఘ రాజ్యాంగాన్ని అందించాడు.
దళితుడిగా ఎన్నో అవమానాలు ఎదుర్కొని చదువుతో ఆ అవమానాలను సత్కారాలుగా మార్చుకుని ఎందరో దళితుల జీవితాల్లో వెలుగులు నింపాడు. భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసాడు. 1990లో భారత ప్రభుత్వం భారత రత్న పురస్కారాన్ని ఇచ్చింది. ఆ మహనీయుడి జయంతి నేడు. 1891వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జన్మించాడు. ప్రస్తుతం 130వ జన్మదినం సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. కొటేషన్లు..
సమాజంలో గౌరవప్రదమైన జీవనాన్ని గడపాలని అనుకుంటే మీకు మీరు సాయం చేసుకుంటారు. దాన్ని మించిన ఉత్తమ సాయం మరోటి లేదు.
మన స్వంత కాళ్ళమీద నిలబడి మనకు కావాల్సిన హక్కుల కోసం పోరాడాలి. కాబట్టి మీ ఆందోళనని కొనసాగిస్తూనే ఉండండి. పోరాటం ద్వారా మాత్రమే అధికారం, ప్రతిష్ట వస్తాయి.
మన ఆలోచనలు నైతికంగా బాగున్నప్పుడే మన పనులు బాగుంటాయి. మీ ఆలోచలకి ఎల్లప్పుడూ నీళ్ళు పోస్తూ ఉండాలి. చెట్లకి నీళ్ళు పోయకపోతే ఎలా వాడిపోతాయో ఆలోచనలు కూడా అలానే వాడిపోతాయి.
స్వేఛ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇచ్చే మతాన్ని నేను గౌరవిస్తాను.
ఉదాసీనత ప్రజలను ప్రభావితం చేసే పరమ చెత్త ప్రక్రియ..