సరిగా… 5 అడుగుల ఆరు అంగుళాల ఎత్తు… బక్క పలుచని, ధృడమైన దేహం… ఉస్మానియా క్యాంపస్ లో నడుస్తూ వస్తుంటే… చూడటానికి రెండు కళ్ళూ చాలేవి కావు… అతను ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడుతుంటే కాలం కూడా ఒక్క క్షణం ఆగి వినేది… “జీనా హైతో మర్నా సీఖో, కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో” ఈ సమర నినాదం అతని నోటి వెంట వింటే… కాకలు తీరిన పోరాట యోధులు కూడా ఒక్క క్షణం ఆగి అతని భుజం తట్టి వెళ్లే వారు… బ్రతికింది 25 ఏళ్ళే… కానీ అతనికి శాశ్వత మరణం మాత్రం లేదు… ఉస్మానియా క్యాంపస్ లో అతను ఇచ్చిన నినాదాలు… ఇంకా వినపడుతూనే ఉన్నాయి…
అతనే భారత భూమి గర్వించే యోధుడు, భరత మాత గర్వపడే మేధావి… జార్జ్ రెడ్డి… అసలు ఎవరీ జార్జ్ రెడ్డి… ఉస్మానియా క్యాంపస్ లో అతను ఎందుకు దేవుడు అయ్యాడు… 25 ఏళ్లకే అతన్ని మట్టుబెట్టే అంతటి సాహసం అతనిలో ఏముంది… ఈ స్టోరీలో చూద్దాం… డబ్బులున్నాయి, నా సంస్కృతి, నా సాంప్రదాయం వేరు అనే భావాలకు దూరంగా బ్రతికిన వాడే ఈ హైదరాబాద్ చేగువేరా… అవును అతను హైదరాబాద్ చేగువేరా… 1947 జనవరి 15న కేరళలోని పాలక్కాడ్ లో చల్లా రఘునాథరెడ్డి, లీలా వర్గీస్‌ల దంపతులకు… నాలుగో సంతానంగా జన్మించాడు జార్జ్ రెడ్డి.
తండ్రి ఉద్యోగ రీత్యా… దేశంలోని అనేక ప్రాంతాలు తిరగడంతో జార్జ్ రెడ్డి చదువు హైదరాబాద్, వరంగల్, బెంగుళూరు వంటి ప్రాంతాల్లో సాగింది. చిన్నప్పటి నుంచి అపార ప్రతిభను కలిగి ఉన్న మేధావి జార్జ్… అతని ఆలోచనలు, అతని నడవడిక… ఈ ప్రపంచానికే ఏదో సంకేతం ఇస్తున్నట్టుగా ఉండేవని అతనితో కలిసి చదువుకున్న విద్యార్థులు నేటికీ చెప్తూ ఉంటారు. విద్యార్థి దశ నుంచే తనకు ఇష్టమైన గణితం, భౌతిక శాస్త్రాల మీద పట్టు సాధించాడు… మేధావులకు కూడా అర్ధం కానీ ఫార్ములాను ఛేదించి అత్యంత సులువుగా వాటిని సాల్వ్ చేసే ప్రతిభ అతని సొంతం.
ఒంటి నిండా విప్లవ భావాలు నింపుకున్న జార్జ్ ని అతని కాలేజీ రోజుల్లో జరిగిన నక్సల్బరీ సాయిధ పోరాటం, శ్రీకాకుళం రైతాంగ ఉద్యమం, పాలస్తీనా పోరాటం వంటివి విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆఫ్రికా చీకటి ఖండంగా మారడానికి దారి తీసిన పరిస్థితులు, దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాలు అనుభవిస్తున్న దుర్భర స్థితి వంటి వాటి మీద అతను అవపోసన పట్టాడు… అతను స్థాపించిన ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ని నడిపించడానికి అతను ప్రపంచ పరిస్థితుల మీద పెంచుకున్న అపార జ్ఞానమే ఉపయోగపడింది. తన సన్నిహితులకు అతను చెప్తున్న పోరాట పాఠాలు విని,
మిగిలిన విద్యార్థులు కూడా కళ్ళు అప్పగించి చూసే వారు… అతని మాటల్లో ఉండే స్పష్టతకు ఫిదా అయిపోయే వారు. ఉస్మానియా లో ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులతో అతను చేసిన సావాసం… పీడిత ప్రజల బతుకులను ప్రభుత్వాలు ఎందుకు దుర్భరంగా మార్చాయి తెలుసుకునే విధంగా నడిపించాయి. ఉస్మానియాలో అగ్రవర్ణాలవారు బడుగు, బలహీన వర్గాల పట్ల ప్రదర్శిస్తున్న వైఖరి, చూపుతున్న వివక్షపై తొలి సారి పోరాడి వారికి అండగా నిలిచాడు జార్జ్ రెడ్డి. భౌతిక శాస్త్రంలో ఎమ్ఎస్సీ చేయడానికి ఉస్మానియాలో అడుగుపెట్టిన జార్జ్ రెడ్డి,
ఏడాది పాటు సస్పెండ్ అయినా సరే… ఆ తర్వాత జరిగిన పరీక్షల్లో టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. ఇక అక్కడి నుంచి పోరాట పంథా మీద దూకుడు పెంచిన జార్జ్… యూనివర్సిటీ రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల్లో ఒక వర్గానికి మద్దతు ఇచ్చి గెలిపించాడు. ఇక అక్కడి నుంచి అతని ప్రతీ అడుగు పాలకులను కూడా భయపెట్టింది. ఇక్కడి నుంచి అతని జీవితం మలుపు తిరిగింది. భౌతిక దాడులు చేయడం ప్రత్యర్ధులు మొదలు పెట్టడంతో అతనికి వచ్చిన బాక్సింగ్ విద్యతో తిప్పి కొట్టాడు. 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో జార్జిపై…
నడిరోడ్డు మీద 30 మంది దాడి చేసి… అత్యంత పాశవికంగా అతనిపై కట్టి పోట్లు దింపారు. ఆ దాడిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. అతను ఎంతగానో అభిమానించే చేగువేరా స్ఫూర్తితో రగిలించిన ఉద్యమానికి ఊపిరులు ఊది అతను తుది శ్వాస విడిచాడు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమాల మీద అతని పట్టు విప్లవకారులనే ఆశ్చర్యపరిచింది. పేద ప్రజల కోసం అతనిని అతను మార్చుకున్న తీరు, లేని వారికి సాయం చేసే గుణం వంటివి నేటికీ ఆశ్చర్యపరుస్తాయి. ఇప్పుడు అతని జీవితం మీద సినిమా వస్తుంది… కానీ అతని జీవితం మాత్రం ఎన్ని సినిమాల్లో చూపించే అంత చిన్నది కాదు…! అందుకే ఉస్మానియా ఇప్పటికి జోహార్ కామ్రేడ్ అని జార్జ్ ని తలుస్తూ ఉంటుంది.