మొక్కలను నాటాలి.. వాటిని చెట్లుగా పెంచాలి.. అవి నీడను ఇస్తాయి.. ప్రకృతి విపత్తుల నుంచి మనల్ని రక్షిస్తాయి.. అని పర్యావరణ వేత్తలు ఎంతగానో చెబుతుంటారు. అయినప్పటికీ కొందరు మాత్రం చెట్లను నరకడమే తమ పనిగా పెట్టుకుంటున్నారు. మనిషి చేస్తున్న ఎన్నో తప్పిదాలు కూడా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీంతో వృక్ష సంపద నానాటికీ తగ్గుతోంది. మనిషికి ఆక్సిజన్ లభించడం లేదు. పర్యావరణంలో ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ ప్లాంట్లను ఎన్నింటిని పెట్టినా ప్రయోజనం ఉండదు. కనుక పర్యావరణంలో ఆక్సిజన్‌ను పెంచే ప్రయత్నం చేయాలి. అందుకు మొక్కలను విరివిగా నాటాలి.
పర్యావరణంలోకి ఆక్సిజన్‌ను ఎక్కువగా విడుదల చేయడంలో పలు వృక్షాలు పేరుగాంచాయి. వాటిల్లో రావి, వేప, మర్రి, అర్జున, అశోక, నేరేడు వంటి వృక్షాలు ముఖ్యమైనవి. ఇవి ఎంతో ఎత్తు పెరుగుతాయి. ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల పర్యావరణంలో ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది. మనిషికి ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది.
ఆయుర్వేద ప్రకారం ఆయా వృక్షాల నుంచి వచ్చే గాలిని పీల్చినా పలు రోగాలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. రావి, వేప, అర్జున, నేరేడు వృక్షాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ వృక్షాలు ఎండాకాలంలో ఏ చెట్టు ఇవ్వని నీడను, చల్లదనాన్ని ఇస్తాయి. గాలిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల ఈ చెట్లను పెంచితే పర్యావరణానికి మేలు జరుగుతుంది. మనిషికి ప్రాణవాయువు లభిస్తుంది. ఆక్సిజన్ కోసం కష్టాలు పడాల్సిన అవసరం రాదు.