యూపీలో హెల్త్‌ ఏటీఎంలు.. ఆలోచన అదుర్స్..!!

-

ఈ మధ్య రకరకాల ఏటీఎంల పేర్లు వింటున్నాం.. ఇన్నాళ్లు ఏటీఎం అంటే.. మనీ తీసుకోవడానికి మాత్రమే వాడేవాళ్లం.. ఇప్పుడు గోల్డ్‌ తీసుకోవడానికి కూడా ఏటీఎంలు వచ్చాయి.. తాజాగా హెల్త్‌ ఏటీఎంలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4,600 హెల్త్ ఏటీఎంలు, వెల్‌నెస్ సెంటర్లు, మెడికల్ కాలేజీలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయబోతోందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వీటి ద్వారా ఆరోగ్యరంగంలో మౌలిక వసతులు పెరుగుతాయి అన్నారు.

ఏటీఎంల దగ్గర వినియోగదారులకు సాయం చేసేందుకు సిబ్బందిని నియమించే ప్రక్రియ ప్రారంభమైందని సీఎం తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక యోగి సర్కారు.. ఆరోగ్యం, లా అండ్ ఆర్డర్, టూరిజం, విద్య, మౌలిక వసతుల కల్పనపై ఎక్కువ దృష్టి పెడుతుంది.

హెల్త్‌ ఏటీఎలంటే ఏంటి..?

దేశంలోనే మొదటి హెల్త్ ఏటీఎంను ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం మథుర జిల్లా ఆస్పత్రి దగ్గరున్న 23 రకాల వ్యాధులకు పరీక్షలు చెయ్యగలదు. 15 నిమిషాలలోనే ఈ పని పూర్తి చేస్తుందట. అదే మనం ఆస్పత్రికి వెళ్తే.. ఈ పని అవ్వడానికి రోజంతా సరిపోతుంది. రిపోర్టుల కోసం ల్యాబుల చుట్టూ పరుగులు పెట్టాలి.. కానీ హెల్త్ ఏటీఎం.. వెంటనే పరీక్షలు చేయడంతో పాటు..పేషెంట్లకు ట్రీట్‌మెంట్ కూడా చెయ్యగలదు.

ఎలా పనిచేస్తుందంటే..

హెల్త్ ఏటీఎంకు ఓ కియోస్క్ ఉంటుంది.. దీనికి టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో ఆరోగ్య సంబంధింత సమాచారం ఉంటుంది. ఇది కంప్యూటర్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. ఇంటర్నెట్ ద్వారా కస్టమర్ల ఆరోగ్య సమాచారాన్ని ఈ యంత్రం గ్రహిస్తుంది.. ఈ హెల్త్ ఏటీఎం కేంద్రంలో ప్రపంచ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉంటాయి. జిల్లాలు, గ్రామాల్లో ఆరోగ్య సమస్యల్ని ఇది పరిష్కరించగలదు. దీని వాడకం తేలిగ్గా, కచ్చితత్వంతో ఉంటుందని అధికారులు అంటున్నారు.. కార్డియాలజీ, న్యూరాలజీ, పల్మనరీ టెస్టులు, గైనకాలజీ, క్లినికల్ డయాగ్నోస్టిక్, లైఫ్ సేవింగ్ ఎక్విప్‌మెంట్, ఎమర్జెన్సీ సర్వీసులను ఈ కియోస్క్ నుంచి పొందవచ్చు.

ఎలా ఆపరేట్‌ చేయాలి..?

ఈ ఏటీఎం కేంద్రంలో కొన్ని రకాల వైద్య పరికరాలు ఉంటాయి. టెస్టుల కోసం వెళ్లిన వారికి… ఎలాంటి పరీక్ష చేయాలో.. అలాంటి పరికరాన్ని ఉపయోగించి.. వైద్య సిబ్బంది టెస్టులు చేయిస్తారు. ఏటీఎం నుంచి టెస్టుల ఫలితాలు రాగానే.. సంబంధిత మందులను సిబ్బంది పేషెంట్లకు ఇస్తారు. ఈ కియోస్క్ ఏ డాక్టర్‌ని కలవాలో చెబుతుంది. వ్యక్తుల బరువు, ఎత్తు, రక్తపోటు రక్తంలో గ్లూకోజ్ లెవెల్, శరీర ఉష్ణోగ్రత, BMI, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం, కండరాల బలం, వేలి ముద్రలు, ECG పల్స్ రేటు, బాడీలో కొవ్వు శాతం, ఆక్సిజన్ లెవెల్స్ వంటి వివరాల్ని ఈ ఏటీఎం ద్వారా పొందవచ్చు.

ఈ కియోస్క్‌ ద్వారా డాక్టర్‌తో లైవ్ వీడియో కన్సల్టేషన్ ఉంటుంది.. హెల్త్ రిపోర్ట్ పొందడమే కాదు.. ఏ మందులు వాడాలో కూడా చెబుతుంది. కొన్ని రకాల మందుల్ని వెంటనే ఇచ్చే వెసులుబాటు కూడా ఉంది. మీ ఆరోగ్యం ఎలా ఉందో ఈ యంత్రం తెలుసుకోగలదు. మొత్తానికి టైమ్‌ సేవింగ్‌ అవుతుంది బాగా.. ఇలాంటి వాటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తే మంచిదే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఏటీఎంలు ఉంటే.. ప్రజలకు చక్కగా వైద్య సదుపాయాలు అందుతాయి. వైరల్ ఫీవర్ల వంటి వాటిని మొదట్లోనే తగ్గించే వీలు ఉంటుంది. ముంబైలోని Yolohealth సంస్థ ఈ ఏటీఎంలను సప్లై చేస్తోంది. ఇప్పటికే 1000కి పైగా సప్లై చేసింది. మరిన్ని సప్లై చేసేందుకు రెడీ చేస్తోంది.

సిటీ దూరంగా ఉండే వాళ్లకి ఆరోగ్య సౌకర్యాలు అందడం చాలా కష్టంగా ఉంటుంది. సరైన రోడ్డు సౌకర్యం లేక ఆసుపత్రికి వెళ్లకుండా.. సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలంటి ప్రాంతాల్లో ఈ ఏటీఎంలు ఉంటే చాలా మేలు జరుగుతుంది.!

Read more RELATED
Recommended to you

Exit mobile version