మదర్స్ డే రోజున మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మహమ్మారి సమయంలో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంటి పనులన్నీ చేసుకుంటూ పాఠశాలలు లేక ఇంట్లోనే ఉంటున్న పిల్లలని చూసుకుంటూ అన్ని పనులతో అలసిపోతున్న మాతృమూర్తుల ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
మహమ్మారి విజృంభిస్తుండడంతో ఒత్తిడి బాగా పెరిగింది. తల్లుల మీద మరీ విపరీతంగా ఉంది. ఇంటి పనులు చూసుకుంటూ ఇంట్లో ఉన్నవాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, పిల్లలని కంట కనిపెడుతూ, వాళ్ళకి కావాల్సినవి చేసి పెడుతూ అలసిపోతున్నారు. ఈ నేపథ్యంలో మాతృమూర్తులు పాటించాల్సిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
రొటీన్ జీవితం
గతంలో రొటీన్ లైఫ్ బోరు కొడుతుంది అనేవారు. కానీ ఇప్పుడు ఆ రొటీన్ లైఫ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు ఆందోళనకి గురి చేస్తున్నాయి. మాతృమూర్తులు తమ రోజువారి పనులని రొటీన్ లైఫ్ లాగా చేస్తూ ఉండాలి. టైమ్ కి వంట, పిల్లల్ని రెడీ చేయడం, సమయానికి తిండి, వ్యాయామం మొదలగునవి చేస్తూ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది.
మహమ్మారి పాఠాలు
కరోనా గురించి చిన్నపిల్లలకి చెప్పడం పెద్ద సమస్య. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కాబట్టి, అర్థమయ్యేలా చెప్పాలి. కావాలంటే కొన్ని ఉదాహరణలు ఇస్తే సులభంగా అర్థం అవుతుంది. దానివల్ల కరోనా గురించి తెలుసుకుని జాగ్రత్తలో ఉంటారు.
ఇతరులతో మాటలు
ఏదైనా విషయం గురించి ఇతరులతో పంచుకుంటే బాధ తగ్గుతుంది. ఇరువురు మాట్లాడుకుంటే మీ సమస్యలు మీరనుకున్నంత పెద్దవిగా అనిపించవు. కాబట్టి మీపై ఒత్తిడి తగ్గుతుంది.
కుటుంబ సమయం
ఇంట్లో అందరినీ ఇంటి పనుల్లో భాగం కానివ్వండి. వంట చేయడంలో, తోటపనిలో, ఇలా అన్ని పనుల్లో భాగం చేస్తే మీపై శ్రమ తగ్గడమే కాకుండా ఒత్తిడీ తగ్గుతుంది.
మీ సమయం
ఎవ్వరికెంత సమయం ఇచ్చినా మీకంటూ కొంత సమయాన్ని ఉంచుకోండి. ఆ సమయంలో మీకు కావాల్సిన పనులు చేసుకోండి. అవి మీ మనసుకు ప్రశాంతతని ఇవ్వాలి. ఇలా ఒక రోజుని ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఒత్తిడులు మీ దరిచేరవు.