పేడతో పెయింట్‌ తయారీ.. లక్షల్లో సంపాదిస్తున్న గ్రామస్థులు..!!

-

పేడతో పిడకలు చేస్తారు, పొలాల్లో ఎరువులుగా వాడతారు అని తెలుసు కానీ.. పేడతో పెయింట్‌ చేయడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? ఛత్తీస్‌గఢ్‌లో పేడతో వివిధ రకాల ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తెచ్చిన RIPA పథకం కింద ఆవు పేడ నుంచి పెయింట్ తయారు చేసే వ్యాపారం ప్రారంభమైంది. ఈ పెయింట్ వల్ల ఆ గ్రామంలోని ప్రజలు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారట..వేల లీటర్ల పెయింట్లకు ఆర్డర్లు వచ్చాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ..! అసలు పేడతో ఎలా చేస్తున్నారు..?

ఛత్తీస్‌గఢ్‌… బిలాస్‌పూర్‌… కోటా ప్రాంతంలోని రాణిగావ్‌లో RIPA పథకం కింద ఆవు పేడ నుంచి సహజ రంగును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పెయింట్ పూర్తిగా నాచురల్‌. ఇది ఎలాంటి హానీ కలిగించదు. ఇది మార్కెట్లో లభించే పెయింట్ల కంటే చవకైనదట. జాగృతి మహిళా స్వయం సహాయక సంఘానికి చెందిన వారు… ఆవు పేడతో పెయింట్‌ను తయారుచేయడం ద్వారా రూ.1లక్ష 80 వేల ఆదాయం ఆర్జించారు. వారికి 45 వేల రూపాయల లాభం వచ్చిందిట. ఇప్పటివరకూ ఆ స్వయం సహాయక బృందం 870 లీటర్ల పెయింట్ అమ్మగా.. మరో 7000 లీటర్ల కోసం ఆర్డర్ వచ్చినట్లు బృంద సభ్యులు తెలిపారు..

రిప కేంద్రంలో పెయింట్ తయారుచేయడమే కాకుండా… ప్లాస్టిక్ బ్యాగుల తయారీలో కూడా మహిళలు పనిచేస్తున్నారు. కోటా జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి యువరాజ్ సిన్హా మాట్లాడుతూ “రాణి గ్రామ రిప (RIPA) కేంద్రంలో స్వయం సహాయక సంఘాల (SHG) ద్వారా గ్రామస్తులు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు” అని పేర్కొన్నారు. ఈ రిప సెంటర్ సుందరీకరణ పనులు త్వరలో పూర్తికానున్నాయి.

ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం పట్ల గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాణిగావ్‌లోని రిపా సెంటర్‌లో తులసిమాత గ్రూప్, జాగృతి మహిళా సేవింగ్స్ గ్రూప్‌లో మొత్తం 20 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు.. వీరంతా ఈ ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందారు. త్వరలోనే ఈ రిప సెంటర్‌లో అగరబత్తుల తయారీ పనులు కూడా ప్రారంభిస్తామని చెబుతున్నారు.

ప్రభుత్వం చేయూత ఇస్తే.. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు చాలా మేలు జరుగుతుంది. వీళ్లలా చాలా మంది.. అవకాశం కోసం ఎదురుచూసే వాళ్లు మన దగ్గరా ఉన్నారు. మంచి మంచి ఐడియాలు పెట్టుకోని పెట్టుబడి లేక ఆగిపోయిన వాళ్లు ఎందరో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version