ఉద్యోగంలో పని ఒత్తిడి, టార్గెట్స్ ఇన్ టైమ్‌కు ఫినిష్ చేయకపోవడం లాంటివి సర్వసాధారణం. స్కోల్లో పిల్లలకు పనిష్‌మెంట్ ఇచ్చినట్లు ఉద్యోగులకు కూడా శిక్ష విధించడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? ఇంకా ఆ శిక్ష ఎలాంటిదో తెలుసా..? ఉద్యోగులతో పచ్చి కాకరకాయలు తినిపిస్తున్నారట. కార్పొరేట్ రంగంలో పని ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టార్గెట్‌లను పూర్తి చేసే పనిలో ఉద్యోగులు(Employees) కొన్నిసార్లు నిద్రాహారాలు కూడా మానేసి పనిచేస్తుంటారు. చైనాలోని(China) ఓ కంపెనీ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరూ ఊహించలేని విధంగా ఉద్యోగులను ఆ కంపెనీ వింతగా శిక్షించింది.
విద్య, శిక్షణ విభాగంలో పనిచేస్తున్న చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని Suzhou Danao Fangchengshi Information Consulting కంపెనీ..టార్గెట్ ను పూర్తి చేయడంలో విఫలమైన ఉద్యోగులతో పచ్చి కాకరకాయ తినిపిస్తోంది. జాంగ్ అనే ఉద్యోగి చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ డౌయిన్‌లో జూన్ 15న కంపెనీ వింత శిక్షకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 12 మంది ఉద్యోగులను ఘాటైన వాసనతో పచ్చి చేదును కలిగి ఉన్న కాకరకాయ తినమని కంపెనీ ఎలా బలవంతం చేసిందో ఆ పోస్ట్‌లో ఉద్యోగి వెల్లడించారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ కంపెనీ చేసిన పనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ విధానాలపై విమర్శలు గుప్పించారు మరోవైపు, కంపెనీ మాత్రం..ఇది రివార్డ్ అండ్ పనిష్‌మెంట్ విధానంలో భాగమని, ఉద్యోగులు కూడా ఇందుకు అంగీకరించారని చెబుతోంది.
ఏది ఏమైనా ఇలా బలవంతంగా పచ్చి కాకరకాయలను తినిపించడం అంటే కంపెనీ దౌర్జన్యానికి నిదర్శనం. మన దగ్గర కూడా కొన్ని కంపెనీలు ఉద్యోగులను బానిసలుగా ట్రీట్ చేస్తున్నారు. ఉద్యోగానికి తీసుకునేప్పుడు చెప్పిన విధులు వేరు తీరా ఉద్యోగంలోకి చేరిన తర్వాత చేయించుకునే పనులు వేరు. ఇచ్చే శాలరీకి డబుల్ చేయించుకుంటున్నారు.