మన దేశంలో ఎన్నో చారిత్రాత్మక ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయం ఒక్కో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఇక అధునాతన కాలంలో నిర్మించిన అద్భుత ఆలయాలు కూడా అనేకం ఉన్నాయి. వాటిల్లో వెల్లూర్‌లోని గోల్డెన్ టెంపుల్ ఒకటి. ఇందులో శ్రీ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలి వస్తుంటారు.
తమిళనాడులోని మలైకోడి ప్రాంతంలో పర్వతాలపై ఆ మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం కోసం 15వేల కిలోల బంగారాన్ని ఉపయోగించారు. ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున బంగారంతో నిర్మించబడిన ఆలయం ఇదొక్కటే కావడం విశేషం. పంజాబ్‌లోని అమృతసర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్‌లో పైకప్పుకు 750 కిలోల బంగారాన్ని వాడారు. అందువల్ల వెల్లూర్‌లోని గోల్డెన్ టెంపుల్ ఈ విషయంలో ఒక మెట్టు పైనే ఉందని చెప్పవచ్చు.
వెల్లూర్ గోల్డెన్ టెంపుల్‌లో ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఉంటుంది. ఆలయం బయటివైపు నక్షత్ర ఆకారంలో నిర్మాణాలు ఉంటాయి. దీని వల్ల ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుని కనిపిస్తుంది. నిత్యం వేల సంఖ్యలో ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు.
వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ రాత్రి పూట ఇంకా సుందరంగా దర్శనమిస్తుంది. అందువల్ల రాత్రి సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఆలయంలో ఉన్న కళాకృతులను పూర్తిగా చేతివృత్తుల వారే రూపొందించడం మరొక విశేషం.