అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలోనే ఫ్యాక్షన్ నడుస్తోంది. పరిటాల రవి కుటుంబానికి ధర్మవరం ఎమ్మెల్యేవరదాపురం సూరీ కుటుంబానికి మధ్య రవి బతికున్నప్పటి నుంచి వైరం నడుస్తోంది. ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో ఉంటున్నా అంతర్గత పోరు మాత్రం ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ మరింత ముదురుతోంది. మంత్రి పరిటాల సునీత ప్రాధినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గం నుంచి కాకుండా ఈసారి పరిటాల శ్రీరామ్ కోసం ధర్మవరం నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించాలని పరిటాల సునీత ఇప్పటికే చంద్రబాబునాయుడు వద్ద మొరపెట్టుకున్నారు. అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు చెప్పారని అంటున్నారు. కానీ తనకుమారుడు పరిటాల శ్రీరామ్ కు ఎలాగైనా ఈసారి ధర్మవరం టికెట్ ఇప్పించుకోవాలన్న పట్టుదల పరిటాల సునీతలో రోజు రోజుకు మరింత పెరుగుతోంది. దీనికి ఆమె అనేక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలు, మంత్రులతోపాటు కుల పెద్దలతోనూ చంద్రబాబు వద్దకు రాయబారాలు పంపుతున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఇసుక దందా, కాంట్రాక్టుల దందాతో వందల కోట్ల రూపాయలు వెనుకేసుకున్నారని, ఆయనకు టికెట్ ఇచ్చిన చిత్తుగా ఓడిపోతారని ప్రచారం చేయిస్తోంది. పరిటాల కుటుంబానికి మరో బద్ద శత్రువైన అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మద్దతుతో వరదాపురం సూరీ కూడా పరిటాల శ్రీరామ్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గంలోనే అదీ తెలుగుదేశం పార్టీలోనే ఇలా అంతర్గత పోరు కొనసాగితే వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వరదాపురం సూరీ సీటుకు ఎసరు పెడుతున్న పరిటాల శ్రీరామ్
-