ఎర్రగడ్డలో  ప్రణయ్ తరహా ఉదంతం

-

మిర్యాలగూడలో కొద్దిరోజుల క్రితం జరిగిన పరువు హత్య మరువక ముందే రాజధానిలో అదే తరహా దారుణం వెలుగు చూసింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. సందీప్, మాధవిలు ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి వారం రోజుల క్రితమే వివాహం చేసుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ బుధవారం మధ్యాహ్నం ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ సమీపంలో వేచి ఉండగా ఓ వ్యక్తి నడిరోడ్డుపై అందరూ  చూస్తుండగానే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సందీప్ తీవ్రంగా గాయపడగా, మాధవికి చేయి, మెడపై గాయాలయ్యాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే నిందితుడు యువతిని భూతులు తిడుతూ అక్కడి నుంచి పారిపోయాడు.

రక్తపు మడుగులో పడిపోయిన ఆ జంటను స్థానికులు వెంటనే స్పందించి సనత్ నగర్ లోని నీలిమ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ టీవీ ఫూటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే దాడికి పాల్పడింది మాధవి తండ్రేనని  అనుమానిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే…

ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ కు చెందిన సందీప్, బోరబండ వినాయక్ నగర్ కు చెందిన మాధవి గత ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరి ప్రేమ విషయాన్ని తల్లీదండ్రులకు తెలియచేయడంతో .. ఇద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ విషయం మరింత ముదరక ముందే మాధవికి తన మేనభావతో వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిశ్చయించారు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసిన మాధవి సందీప్ ని పదిరోజు క్రితం అల్వాల్ లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు మొదట వ్యతిరేకించి ఆ తర్వాత నెమ్మదిగా ఒప్పుకున్నట్లు నటించారు. అప్పటి నుంచి మాధవి తన భర్త సందీప్ ఇంట్లోనో ఉంటుంది.

ఈ విషయాన్ని తట్టుకోలేని మాధవి తండ్రి రెండు రోజులుగా మాధవికి కలుస్తూ ప్రేమగా నటించారు. తండ్రి ప్రేమను గుడ్డిగా నమ్మి సందీప్, మాధవిలకు నూతన వస్త్రాలు కొనిస్తానని చెప్పడంతో ఎర్రగడ్డలోని హోండా షోరూం దగ్గరకు వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారం వారు అక్కడికి చేరుకోగానే సందీప్, మాధవిపై కత్తులతో దాడిచేశారు. స్థానికుల సాయంతో నీలిమ ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా మారడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version