పంజాబ్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పొత్తులపై పార్టీలు నజర్ పెట్టాయి. పంజాబ్ లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, శిరోమణి అకాలీదల్, బీజేపీ, అమరిందర్ సింగ్ కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీల మధ్య బహుముఖ పోటీ నెలకొంది. గతంలో బీజేపీ మిత్ర పక్షమైన శిరోమణి అకాళీ దల్ ఇప్పుడు ఎన్డీయే కూటమిలో నుంచి బయటకు వచ్చింది. దీంతో కొత్త మిత్రుల కోసం బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంట్లో భాగంగానే అమరిందర్ సింగ్ కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలో పొత్తు కుదిరింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండీ… సీఎంగా పనిచేసిన అమరిందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు. అయితే పార్టీ ప్రారంభానికి ముందే పలుమార్లు అమిత్ షాతో అమరిందర్ సింగ్ భేటీ అయ్యారు. ముందుగా బీజేపీలో చేరుతారంటూ… ఊహాగానాలు వెల్లువెత్తినా.. కొత్త పార్టీ పెట్టేందుకే అమరిందర్ సింగ్ మొగ్గు చూపారు.
ఇదిలా ఉంటే.. పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ పార్టీ మధ్య పొత్తు ఖరారైంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి గజేంద్రసింగ్ షెకావత్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఏడు ధపాలుగా రెండు పార్టీల మధ్య చర్చ జరిగిందని.. ఆయన వెల్లడించారు. ఏడో విడత చర్చల్లో పొత్తు ఖరారైందన్నారు గజేంద్ర సింగ్ షెకావత్. కాగా ఇప్పటి వరకు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని షెకావత్ తెలిపారు.