దక్షిణాది సూపర్‌స్టార్ మమ్ముట్టి ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని చిత్రాలను షేర్ చేశారు. స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న ఆ చిత్రాలు.. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే వర్కౌట్లతో టైంపాస్ చేస్తున్నానని తెలిపారు మమ్ముట్టి. టీ షర్ట్, జిమ్ గ్లోవ్స్ వేసుకుని ఉన్న చిత్రాలను షేర్ చేస్తూ… “ఇంట్లోనే వర్కవుట్ చేస్తున్నా! హోం వర్క్! ఇంకేం వర్క్ లేదుగా.. అందుకే వర్కవుట్!” అనే వ్యాఖ్యానాన్ని జతచేశారు.
ఈ ఫొటోలకు ఫ్యాన్సే కాకుండా ఆయన సహ నటులూ ఫిదా అయ్యారు. మమ్ముట్టిని పొగడ్తల్లో ముంచెత్తారు. ‘మమ్ముట్టి సర్.. మీ వయసు తగ్గిపోతోందా’ అంటూ కామెంట్లు పెట్టారు.మమ్ముట్టి మాతృభాష మలయాళంలోనే కాకుండా ఇంగ్లీషు, హిందీ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి సూపర్‌స్టార్ అనిపించుకున్నారు. తన నలభై ఏళ్ల కెరీర్‌లో ఆయన 400 పైగా చిత్రాల్లో నటించారు. పద్మశ్రీతో పాటు మూడు జాతీయ అవార్డులు, ఏడు కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డులనూ సొంతం చేసుకున్నారు. గతేడాది ఆయన నటించిన ‘మామంగం’ తెలుగులోనూ విడుదలైంది.