తనను, తన అన్న అసదుద్దీన్ పైన విమర్శలు చేయవచ్చునని, అప్పుడు మీ రాజకీయ ఎత్తులను మేం చిత్తు చేస్తామని మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమ జోలికి రావొద్దని, వస్తే కనుక ఆయన జీవితచరిత్ర బట్టబయలవుతుందని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. సోమవారం చాంద్రయాన్‌గుట్టలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కావాలంటే తనను, తన అన్న అసదుద్దీన్ పైన విమర్శలు చేయవచ్చునని, అప్పుడు మీ రాజకీయ ఎత్తులను మేం చిత్తు చేస్తామన్నారు. కానీ మా తమ్ముడికి రాజకీయాల గురించి తెలియదని, మా కుటుంబం దగ్గరకు రావొద్దని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్సెస్ నుంచి వచ్చాడని, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారని చెప్పారు. తెలంగాణలో రెడ్డి, రావు… ఎవరైనా సరే మా ముందు వంగాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకు ప్రతిచోట హిందూ – ముస్లిం గొడవలు తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. 55 మతపరమైన గొడవలకు కాంగ్రెస్ కారణమన్నారు. నెహ్రూ దేశ విభజన వల్లే భారత్ – పాకిస్తాన్ రెండు ముక్కలైందని, లేదంటే ఒకే దేశంగా ఉండేవన్నారు-. తన అన్న అసదుద్దీన్ పై కేసులు పెట్టారని, తనను నిజామాబాద్ జైల్లో ఉంచారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అప్పుడు తన కుటుంబ సభ్యులను కూడా కలవనీయలేదన్నారు. తనకు ట్రీట్మెంట్ కూడా చేయలేదంటే కాంగ్రెస్సే కారణమన్నారు. రేవంత్ రెడ్డి తమను రెచ్చగొట్టవద్దన్నారు.