తెలంగాణ సీఎం కేసీఆర్ ను కేంద్రమంత్రి హర్షవర్దన్ కలిశారు. రాష్ట్రంలో రెండోసారి తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌కు ప్రగతి భవన్లో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్.. పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్రం నుంచి తగిన సహకారం అందించాలని ఆయనను కోరారు. గతంలో అటవీ శాఖ తీసుకున్న్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో భారీగా చెట్లు తగ్గిపోయాయని కేసీఆర్ వివరించారు. తరిగిపోయిన అటవీ సంపదను, పచ్చదనాన్ని పెంపొందించేలా రాష్ట్రంలో హరితహారం వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన వివరించారు. అటవీ బ్లాకుల అభివృద్ధి కోసం కాంపా నిధుల్లో కేంద్రం వాటా నుంచి రూ.100 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతులు సత్వరం వచ్చేలా చూడాలని కోరారు. అడవుల రక్షణ కోసం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి వివరించారు.