టీ.. తేనీరు.. ఛాయ్.. ఏ పేరుతో పిలిచినా కోట్లాది మందికి ఇదో ఇష్టమైన పానీయం.. ఎంత స్ట్రెస్ ఉన్నా.. ఓ కప్పు టీ తాగితే రిలీఫ్ గా ఫీలయ్యేవారు ఎందరో.. మోతాదు మించకుండా టీ తాగడం ఆరోగ్యానికి కూడా మంచిదని కూడా అనేక నివేదికలు చెబుతున్నాయి.
మనసుకు చికాకు పుట్టినా.. కొత్త వారితో దోస్తీ కట్టినా.. వానపడినా.. ఎండకాసినా నచ్చిన టీ రుచులను ఆస్వాదించాల్సిందే. అయితే ఈ టీలో చాలా రకాలు ఉన్నాయి.. అందులో గొప్పగా చెప్పుకోవాల్సింది ఎల్లో బడ్ టీ.. ఎందుకంటే.. ఇది చాలా కాస్ట్లీ గురూ.. రెండు కప్పుల ఈ టీ విలువెంతో తెలుసా.. అక్షరాలా రూ. 7,000 రూపాయలు.
మరి ఎందుకంత ధర అంటారా.. ఈ టీపొడిని.. 24 కేరట్ల బంగారంతో అచ్చమైన తేయాకును ఎండబెట్టి మిళితం చేసిన ఫేవర్ ఇది. ఈ టీ పొడి కిలో ధర సుమారు రూ.8 లక్షల పైమాటేనట. ఇక ఈ టీ తాగాలంటే.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని టీ రూమ్స్, కేఫ్ క్లబ్బులకెళ్లాలి.
అల్పాహారంతో పాటు.. మనసును ఉల్లాసపరిచే విభిన్నమైన తేనీటి రుచులను అందిస్తున్నాయి. 40-60 వరకు వెరైటీలు ఇక్కడ అందించటం విశేషం. అసోం, డార్జిలింగ్, కశ్బీర్, చైనా, సింగపూర్ తదితర దేశ విదేశాల నుంచి నగరానికి దిగుమతి చేసుకుంటున్నారు. గ్రీన్, బ్లాక్, జాస్మిన్, అల్లం, పుదీనా, లెమన్ గ్రాస్, నీమ్ సెక్టార్, నీమ్, తులసి, ఆర్గానిక్ గ్రీన్లలు సాధారణంగా దొరుకుతుంటాయి.