కరోనా వల్ల లాక్‌డౌన్‌లు విధిస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజలు ఇంట్లో నాలుగు గోడల మధ్య బందీలు అవుతున్నారు. అయితే ఇంట్లో అలా ఊరికే కూర్చోకుండా కొందరు తమలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీస్తున్నారు. అందులో భాగంగానే బెంగళూరుకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఏకంగా గో కరోనా గో (Go Corona GO) వెబ్ గేమ్‌ను డెవలప్ చేశాడు. ప్రజల్లో కోవిడ్ పట్ల అవగాహనను కల్పించేందుకు అతను ఈ గేమ్‌ను రూపొందించాడు.
బెంగళూరుకు చెందిన అభినవ్ రజత్ దాస్ లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉండకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. గో కరోనా గో అనే వెబ్‌గేమ్‌ను డెవలప్ చేశాడు. ఇందులో రిచ్ యానిమేషన్, మ్యూజిక్ యూజర్లను ఆకట్టుకుంటుంది. దీంతో వారు గేమ్ ఆడుతూ ఉండవచ్చు. అలాగే కోవిడ్ పై అవగాహనను పెంచుకోవచ్చు.
కరోనా నేపథ్యంలో మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు రాసుకోవడం వంటి అంశాలపై గేమ్‌లో అవగాహనను పెంపొందించుకోవచ్చు. అలాగే కోవిడ్ టీకాను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. ఈ గేమ్‌లో 3 లెవల్స్ ఉంటాయి. ఒక్కో లెవల్‌ను దాటుతూ ముందుకు సాగాల్సి ఉంటుంది. మూడు లెవల్స్‌ను దాటితే కరోనా వైరస్‌ను జయించినట్లు లెక్క. ఇక ఈ గేమ్‌ను ఇంటర్నెట్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. కానీ ప్రస్తుతం దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నానని అభినవ్ తెలిపాడు.