ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఆరంభ సీజన్ నుంచి ఆడిన ప్రతి సీజన్ లోనూ (ఒక్క 2020 సీజన్ మినహా) ప్లే ఆఫ్స్ కు చేరుకున్న జట్టుగా చెన్నైకి రికార్డు ఉంది. ఈ రికార్డు ఐపీఎల్ టైటిల్స్ ను అత్యధికంగా ఐదు సార్లు గెలిచిన ముంబై ఇండియన్స్ కు కూడా లేదు.
ముంబై తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చాంపియన్ గా అత్యధిక సార్లు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు టైటిల్ ను గెలిచింది. ఇంతటి ఘనమైన ట్రాక్ రికార్డును కలిగి ఉన్న చెన్నై సూపర్ కింగ్స్… 2020లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆ సంవత్సరం చెన్నై ఏడో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. 2020 చెన్నై జట్టుకు పేలవ సీజన్ అయినప్పటికీ… ఓ రికార్డును మాత్రం కొనసాగిస్తూనే వచ్చింది. అదేంటంటే.. తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోకుండా ఉండటం. చెన్నై మొదట ఆడే రెండు మ్యాచ్ ల్లో కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా తప్పక గెలుస్తూ వచ్చింది. అయితే తాజా సీజన్ తో చెన్నై ఆ రికార్డుకు బ్రేక్ వేసింది. తొలిసారి ఓ ఐపీఎల్ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఓడింది. మొన్న కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిన చెన్నై… తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో కూడా ఓడిపోయింది. దాంతో 2022 సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడింది. తద్వారా తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ తమ ఐపీఎల్ ఓపెనింగ్ రెండు మ్యాచ్ ల్లో కనీసం ఒక్క దాంట్లో కూడా గెలవలేకుండా పోయింది.