కరోనా సర్వమానవ సమానత్వం ఖచ్చితంగా పాటిస్తుంది. రాజు-పేదా తేడా లేకుండా అందరినీ పలకరిస్తోంది. ఇప్పుడు అత్యంత ధనికదేశం, ఎడారి సామ్రాజ్యం సౌదీ అరేబియా రాజ కుటుంబీకులకు కూడా కొవిడ్-19 సోకినట్లు తెలిసింది.
సౌదీలో మొదటికేసు నమోదైన ఆరు వారాల తర్వాత కరోనా రాజ కుటుంబంపై దాడి చేసింది. దాదాపు 150 మంది రాజకుటుంబసభ్యులకు కరోనా సోకినట్లు, సీనియర్ సౌదీ సీనియర్ యువరాజు, రాజధాని గవర్నర్ ఫైజల్ బిన్ బందర్ బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్ (70) కరోనా పాజిటివ్‌తో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నట్లు ‘‘న్యూయార్క్ టైమ్స్’’ పత్రిక తెలిపింది.
ఇదిలా ఉండగా, 500లకు పైగా ఐసీయూ బెడ్స్ సిద్ధం చేస్తున్నట్లు రాజ కుటుంబ ప్రత్యేక ఆసుపత్రి, కింగ్ ఫైజల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ తన సీనియర్ వైద్యులకు అందుబాటులో ఉండాల్సిందిగా ‘హై అలర్ట్’ సందేశం పంపింది. రాజకుటుంబసభ్యులు, వారి సన్నిహితుల కోసం ఈ ఏర్పాటు చేస్తున్నట్లు ఆసుపత్రి అధికారులు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రోగులను వెంటనే వేరే ఆసుపత్రికి తరలించాల్సిందిగా కూడా ఆదేశాలిచ్చారు.
150 మంది రాజకుటుంబీకులకు కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. వెయ్యిమందికి పైగాఉన్న యువరాజులు తరచూ యూరప్ దేశాలను సందర్శిస్తుంటారు. వారే కరోనాను మోసుకొచ్చారని అనుమానిస్తున్నారు. సౌదీ రాజు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్(84) జెడ్డా దగ్గర్లోని ఒక ద్వీప భవనంలోకి ఐసోలేషన్‌లో వెళ్లిపోగా, సర్వాధికారి, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (34) తన మంత్రివర్గ సహచరులతో ఒక అజ్ఞాత ప్రదేశంలో తాను నిర్మించబోయే అత్యాధునిక భవిష్యత్ నగర ప్రాంతానికి వెళ్లిపోయారు. అన్నట్లు దాని పేరు నియోమ్.
3 కోట్ల 30లక్షల జనాభా ఉన్న సౌదీలో ప్రస్తుతం 3,651 పాజిటివ్ కేసులుండగా, 47 మంది మరణించారు. 685 మంది కోలుకున్నారు. ఇస్లాంకు పరమ పవిత్రమైన మక్కా, మదీనాలలో ఏడాది పొడవునా జరిగే ఉమ్రా యాత్రను సైతం ప్రభుత్వం నిషేధించింది. ఈ ఏడాది జులై మాసాంతంలో జరగాల్సిఉన్న హజ్‌యాత్రపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రసుత్తం దేశం మొత్తం సంపూర్ణ లాక్‌డౌన్‌లో ఉంది.