ఏపీలో పెద్దఎత్తున పీడీఎస్ రైస్ అక్రమంగా పట్టుబడుతున్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ సీరియస్‌గా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రెండు జిల్లాల్లో రేషన్ బియ్యాన్ని అక్రమ తరలింపు అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు.ప్రకాశం, కడప జిల్లాల్లో భారీగా పీడీఎస్ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో అక్రమంగా నిల్వ చేసిన 1,500 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు.
వియత్నాంకు ఎగుమతి చేసేందుకు ఓ రైస్ మిల్లు వీటిని అక్రమంగా నిల్వ చేసినట్లు తెలిసింది.పక్కా సమాచారం మేరకు పోలీసులు మిల్లుపై దాడి చేశారు.1,500 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మిల్లును సీజ్ చేసినట్లు తెలిసింది. అటు కడప జిల్లా మైదుకూరులో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ లారీ చెన్నై పోర్టుకు వెళ్తున్నట్లు గుర్తించారు. లారీని మైదుకూరు పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.