జమ్మూ కాశ్మీర్ లోని బుడ్‌గాం జిల్లాలో ఉన్న షరారె-షరీఫ్ వద్ద క్యాంప్ చేస్తున్న 181 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కు ఏకంగా రూ.1.50 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. దీంతో క్యాంప్ అధికారులు షాకయ్యారు. జూలై నెలకు గాను ఆ మొత్తం కరెంటు బిల్లును ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ లోని పవర్ డెవలప్ మెంట్ డిపార్ట్‌మెంట్ (పీడీడీ) ఆ బిల్లును బెటాలియన్ అధికారులకు అందజేసింది.
అయితే ఆ క్యాంపుకు ఇస్తున్న విద్యుత్ 50కిలోవాట్లు. కరెంటు బిల్లు కూడా రూ.1500 ఫిక్స్‌డ్‌గా వస్తుంది. కానీ ఈసారి మాత్రం పెద్ద మొత్తంలో బిల్లు వచ్చింది. ఆగస్టు 10న పీడీడీ సిబ్బంది ఆ బిల్లును బెటాలియన్ అధికారులకు అందజేశారు. దానికి గడువు తేదీ ఆగస్టు 27 వరకు ఉంది. అయితే ఇది పూర్తిగా సాంకేతిక లోపమని, సమస్యను పరిష్కరించేలా పీడీడీ అధికారులను సంప్రదిస్తామని బెటాలియన్ అధికారులు తెలిపారు.
కాశ్మీర్ లోయలో ఉన్న 181 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ ఏడీజీ జుల్ఫికర్ హసన్ మాట్లాడుతూ.. ఏదో సాంకేతిక లోపం వల్లే కరెంటు బిల్లు రూ.1.50 కోట్లు వచ్చి ఉంటుందని అన్నారు. దీనిపై పీడీడీని సంప్రదిస్తున్నామని, అయితే వారాంతం కావడం వల్ల ఆఫీసు మూసి ఉందని, మరో 2, 3 రోజుల్లో సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు.