బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం గతంలో చేపట్టిన కులగణనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫేక్ గా పేర్కొనడం పై NDA మండిపడింది. మొన్నటివరకు బీహార్ కుల సర్వేను ప్రశంసించిన ఆయన.. ఇప్పుడు దానిని నకిలీగా పేర్కొనడం విస్మయకరమని పేర్కొంది. నితీష్ కుమార్ గతంలో ఇండియా కూటమి సమావేశాలలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు రాహుల్ మౌనంగా ఉన్నారని ఆరోపించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర కులగణన వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించింది.
లోక్ సభ ఎన్నికల తరువాత తొలిసారి బీహార్ లో పర్యటించిన సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా కులగణనను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను మోసం చేసేందుకు ఉద్దేశించి.. 2022-23 బీహార్ లో స్థానిక ప్రభుత్వం నిర్వహించిన విధంగా ఈ ప్రక్రియ నకిలీది కాదని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ లో కులగణన వివరాలు వెల్లడైన సమయంలో కాంగ్రెస్ సైతం నితీష్ కుమార్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం విశేషం.