యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న కకోరి అనే ప్రాంతాన్ని సీల్ చేసింది. ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో టెర్రరిస్టులు దాక్కుని ఉన్నారన్న సమాచారం మేరకు అక్కడికి బాంబ్ స్క్వాడ్ చేరుకుంది. ఆ ప్రాంతంలోని ఓ చోట టెర్రరిస్టులు బాంబు పెట్టారని ఏటీఎస్‌కు సమాచారం అందింది. దీంతో వారు ఆ ప్రాంతం మొత్తాన్ని దిగ్భంధించారు. లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. అక్కడ ఉన్న స్థానికులను కూడా భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఖాళీ చేయిస్తున్నారు. ఇక అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
కాగా ఏటీఎస్‌కు చెందిన అధికారులు ఓ ప్రెషర్ కుక్కర్ బాంబ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతం మొత్తాన్ని అణువణువునా గాలిస్తున్నారు. ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయేమోనని బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. కాగా జమ్మూ పేలుళ్లతో సంబంధం ఉందని భావిస్తున్న ఇద్దరు అల్ కైదా తీవ్రవాదులను కూడా ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. వారి పేర్లను మినాజ్, మస్రుదీన్‌గా వెల్లడించింది. అక్కడ ఇంకా ఎవరైనా తీవ్రవాదులు నక్కి ఉన్నారేమోనని ప్రతి ఇంటిని గాలిస్తున్నారు.
కాగా కకోరి ఏరియాలో బీజేపీ నాయకుడు కౌశల్ కిశోర్ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అక్కడ టెర్రరిస్టులు పట్టుబడడం, బాంబులు లభ్యం కావడం సంచలనం కలిగిస్తోంది. స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కౌశల్‌ని లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు బాంబులు పెట్టేందుకు ప్లాన్ చేశారా ? లేక అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ప్రజలను టార్గెట్ గా చేసి పేలుళ్లకు కుట్ర పన్నారా ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఆయా విషయాలపై ఆదివారం సాయంత్రం 5 గంటలకు యూపీ డీజీపీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు. దీంతో మరింత సమాచారం తెలియనుంది.