కరోనా మొదటి వేవ్ వచ్చినప్పటి నుంచి కరోనా వైరస్ అనేక రకాల స్ట్రెయిన్ల రూపంలో దాడి చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తగా ఆ వైరస్ మారుతోంది. ఈ క్రమంలోనే భిన్న దేశాల్లో పలు రకాల కోవిడ్ వేరియెంట్లు ఉద్భవించాయి. అయితే బెల్జియంకు చెందిన ఒక మహిళలో ఏకంగా రెండు కోవిడ్ స్ట్రెయిన్లు సైంటిస్టులు గుర్తించారు. దీంతో వారు షాక్ తిన్నారు.
బెల్జియంకు చెందిన ఓ మహిళ గత మార్చి నెలలో కోవిడ్ కారణంగా హాస్పిటల్‌లో చేరింది. ఆమె వ్యాక్సిన్ తీసుకోలేదు. అయితే కవేలం 5 రోజుల్లోనే ఆమెకు ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందింది. శ్వాసకోశ సమస్యలు వచ్చాయి. దీంతో ఆమె మృతి చెందింది. తరువాత ఆమె శ్వాసకోశ శాంపిల్స్ ను సేకరించిన సైంటిస్టులు పరీక్షలు చేయగా, ఆమెలో రెండు రకాల కోవిడ్ వేరియెంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఒకటి యూకేకు చెందిన ఆల్ఫా వేరియెంట్ కాగా రెండోది సౌతాఫ్రికాకు చెందిన బీటా స్ట్రెయిన్. ఈ రెండు కరోనా స్ట్రెయిన్లను ఒకే మహిళలో గుర్తించడం ఆందోళన చెందాల్సిన విషయమని సైంటిస్టులు చెబుతున్నారు.
ఒక మహిళలో రెండు రకాల కోవిడ్ స్ట్రెయిన్లు ఉండడం కొత్తేమీ కాదు. ఇటీవలి కాలంలో ఈ తరహా కేసుల సంఖ్య పెరిగింది. అయితే రానున్న రోజుల్లొ ఇలా ఒకటి కన్నా ఎక్కువ కోవిడ్ స్ట్రెయిన్లు ఒకే వ్యక్తికి సోకితే కష్టమని, బాధితులను రక్షించడం, చికిత్సను అందించడం కష్టతరమవుతుందని, ఎందుకంటే ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, దీంతో తక్కువ సమయంలోనే రోగి చనిపోయేందుకు అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఈ మేరకు సైంటిస్టులు యురోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీలో ఈ వివరాలను వెల్లడించారు. ఒకటి కన్నా ఎక్కువ కోవిడ్ స్ట్రెయిన్లు ఒకే వ్యక్తికి సోకితే చాలా ప్రమాదమని, ఈవిషయంపై ప్రభుత్వాలు ఆలోచన చేయాలని, కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని అంటున్నారు.