స్విగ్గీ డెలివరీ బాయ్స్ గురించి అందరికీ తెలిసిందే. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్‌ను రెస్టారెంట్ నుంచి పరిమిత సమయంలో ఆర్డర్ చేతికి అందించే పని. ఆర్డర్ టైంకు అందకపోయినా.. ఇటు కస్టమర్ నుంచి.. అటు కంపెనీ నుంచి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తుంది. దీంతో వారు ఫుడ్ ఆర్డర్ ఆలస్యం కాకుండా చూసుకుంటారు. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని ఓ హోటల్ సిబ్బంది.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడికి దిగింది. ఫుడ్ ఆలస్యం అయిందని అడిగినందుకు రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏరియాలో చోటు చేసుకుంది. స్థానిక పీఎస్ పరిధిలోని ఓ హోటల్ యాజమాన్యం స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడికి దిగింది. ఫుడ్ సర్వీస్ కోసం డెలివరీ బాయ్ అరగంట పాటు హోటల్ ముందు ఎదురు చూశాడు. ఫుడ్ ఆలస్యం కావడంతో యజమాని దగ్గరికి వెళ్లి అడిగాడు. ఈ క్రమంలో యజమానితో సహా 20 మంది హోటల్ సిబ్బంది.. ఫుడ్ డెలివరీ బాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెలివరీ బాయ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే విషయం తెలుసుకున్న స్విగ్గీ డెలివరీ బాయ్స్ హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుడికి న్యాయం చేసేంతవరకు ఆందోళన ఆగదన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు హోటల్ యజమానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.