టెక్ కంపెనీల్లో ఉద్యోగుల ఉద్వాసన పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా యాహూ కూడా తన సిబ్బందిలో 20 శాతం మందిని ఇంటికి పంపుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా యాడ్- టెక్ విభాగంలోని ఉద్యోగుల్లో సగం మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
గురువారం ఆఫీసు కార్యకలాపాలు ముగిసే సమయానికే కంపెనీలో 12 శాతం అంటే 1,000 మందిని తొలగిస్తున్నట్లు యాహూ తమ ఉద్యోగులకు తెలియజేసింది. మరో 8 శాతం అంటే 600 మందికి వచ్చే ఆరు నెలల్లో ఉద్వాసన పలుకుతామని పేర్కొంది. ఆర్థిక పరిస్థితుల వల్ల ఉద్యోగులను తొలగించడం లేదని యాహూ సీఈఓ జిమ్ లైన్జోన్ చెప్పడం గమనార్హం. లాభదాయకతలేని కంపెనీ బిజినెస్ అడ్వర్టైజింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.