హైదరాబాద్ లో చాలామంది ఆఫీస్ లకు, స్కూల్స్, కాలేజ్, ఇతరత్రా పనుల నిమిత్తం వెళ్ళేవాళ్ళు ఎక్కువగా బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు వెళ్లిన పని ఆలస్యమైతే బస్సులు ఉండవని కంగారు పడుతుంటారు. అయితే ఇక నుంచి కంగారు పడాల్సిన అవసరం లేదని టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ బస్సులు డిపోలకు చేరుకొనే సమయానికి రెగ్యులర్ బస్సులు తిరిగి రోడ్డెక్కుతాయి. దీంతో 24 నాలుగు గంటల పాటు ప్రయాణికులు ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో నైట్‌బస్సులు ప్రయోగాత్మకంగా నడుపుతున్న ఆర్టీసీ.. ప్రయాణికుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోందని వెల్లడించింది.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆలస్యంగా నగరానికి చేరుకొనే ప్రయాణికులు, తెల్లవారు జామునే దూరప్రాంతాలకు బయలుదేరేవారికి ఈ బస్సులు అనుకూలంగా ఉన్నాయి. అర్ధరాత్రి నగరానికి చేరుకొనే ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లేందుకు పెద్ద మొత్తంలో చెల్లించవలసి వస్తోంది. మరోవైపు ప్రయాణికుల భద్రతకూడా ప్రశ్నార్ధకమే. ఈ నేపథ్యంలో తాము ప్రవేశపెట్టిన సిటీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ లభిస్తోందని, డిమాండ్ మేరకు నగరంలోని మరిన్ని మార్గాల్లో బస్సులను ప్రవేశపెడుతామని ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్‌మేనేజర్ వెంకన్న వెల్లడించారు.