బీఆర్ఎస్ సీనియర్ నేతలతో పాటు తమ కార్యకర్తల అరెస్టులను నిరసిస్తూ గులాబీ పార్టీ శుక్రవారం ట్యాంక్ బండ్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్ శ్రేణులు ట్యాంక్ బండ్ వద్దకు రాకుండా నిలువరిస్తున్నారు. గురువారం అర్థరాత్రి నుంచే కీలక నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు.
తాజాగా శుక్రవారం ఉదయం నార్సింగిలోని పుప్పాలగూడ క్రిన్స్ విల్లాలో ఉన్న ఎమ్మెల్యే హరీశ్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవితను సైతం గృహ నిర్భంధం చేశారు. ఇక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం.ట్యాంక్‌బండ్ వద్ద బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.