ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ మరోసారి చిక్కుల్లో ఇరుక్కుంది. గతంలో యూకేకు చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జి అనలిటికా ఫేస్‌బుక్‌లోని 87 మిలియన్ల మంది యూజర్ల డేటాను తమ స్వప్రయోజనాలకు వాడుకోగా.. ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. దీంతో ఫేస్‌బుక్‌పై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఏకంగా 5 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అయితే ఆ సంఘటన ఇంకా మరిచిపోకముందే ఫేస్బుక్ అలాంటిదే మరో కొత్త సమస్యలో ఇరుక్కుంది.
ఫేస్‌బుక్‌లోని 26.7 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని పలువురు హ్యాకర్లు చోరీ చేసి దాన్ని డార్క్ వెబ్‌లో కేవలం 500 యూరోలకే (దాదాపుగా రూ.41వేలు) అమ్ముకున్నారని ప్రముఖ సైబర్ రిస్క్ అసెస్మెంట్ ప్లాట్‌ఫాం సైబిల్ వెల్లడించింది. తాము ఆ సమాచారాన్ని డౌన్లోడ్ చేసి వెరిఫై చేశామని సైబిల్ తెలిపింది. అయితే యూజర్లకు చెందిన ఈ-మెయిల్ అడ్రస్‌లు, ఫేస్బుక్ ఐడీలు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్లను మాత్రమే హ్యాకర్లు చోరీ చేశారని.. వారి అకౌంట్లకు చెందిన పాస్వర్డ్లు చోరీకి గురి కాలేదని సైబిల్ తెలియజేసింది.
ఇకఫేస్బుక్లో చోరీ కాబడిన సదరు యూజర్ల సమాచారం ఇప్పటికే డార్క్ వెబ్‌లో ఎంతో మంది చేతులు మారిందని సమాచారం. అయితే ఈ విషయంపై ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. తాము ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, యూజర్ల సమాచారాన్ని సురక్షితంగా ఉంచేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. అయితే ఫేస్బుక్ ఒక్కటే కాదు.. తాజాగా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకుంటున్న జూమ్ అనే యాప్‌కు చెందిన దాదాపు 5 లక్షల లాగిన్ క్రెడెన్షియల్స్‌ను కూడా కొందరు హ్యాకర్లు చోరీ చేశారని ఇప్పటికే సైబిల్ తెలిపింది. అయితే తాజాగా ఫేస్బుక్లో జరిగిన డేటా చౌర్యం దృష్ట్యా యూజర్లు తమ సెక్యూరిటీ, ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చుకోవాలని ఐటీ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.