భారీ వర్షాలతో విజయవాడ దుర్గ గుడి వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. మౌన స్వామి ఆలయం వద్ద బీటలు వారిన కొండ నుంచి రాళ్లు జారి కింద పడిపోయాయి. దీంతో అక్కడున్నవారంతా భయాందోళనతో పరుగులు తీశారు. నిజానికి వారం నుండి చిన్న చిన్న రాళ్లు కింద పడడంతో అక్కడ హెచ్చరిక బోర్డుల్ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు.
రెండుమూడు రోజుల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా రాళ్ల కింద నలుగురు చిక్కుకుని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీస్, పారిశుద్ధ సిబ్బంది చరియల కింద ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. విధుల్లో ఉండి కనిపించకుండా పోయిన వారి గురించి ఇప్పుడు ఆరా తీస్తున్నారు. మరో వైపు మహా మండపం లిఫ్ట్ మార్గం నుంచి సీఎం జగన్ దుర్గమ్మ దర్శనానికి వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక గంట ఆలస్యంగా జగన్ దుర్గమ్మ ఆలయానికి రానున్నారు.