కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ అయ్యాక చాలా మందికి మొదటి రెండు, మూడు రోజుల్లోనే లక్షణాలు కనిపిస్తాయని.. కొందరికి వారం అయ్యాక లేదా ఆ తరువాత లక్షణాలు కనిపిస్తాయని.. సైంటిస్టులు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అయితే కొందరిలో మాత్రం కరోనా సోకినా దాదాపుగా ఎలాంటి లక్షణాలు కనిపించవని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనలో వెల్లడైంది.
చైనాలోని గువాంగ్‌జూ ఎయిత్ పీపుల్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 94 మంది కరోనా పేషెంట్లను పలువురు సైంటిస్టులు పరిశీలించారు. ఈ క్రమంలో వారిలో 44 శాతం మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. అయినా వారికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే ప్రస్తుతం మన దేశంలో కరోనా లక్షణాలు ఉంటేనే చాలా మందికి పరీక్షలు చేస్తున్నారు. కానీ కరోనా లేకున్నా అక్కడక్కడా ర్యాండమ్‌గా ఆ పరీక్షలు చేయాలని భారత వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 5911 మందికి ఇటీవలే ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహించింది. దీంతో వారిలో 1.8 శాతం.. అంటే 104 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక దేశంలో ఎవరికైనా సరే.. కరోనా లక్షణాలు ఉన్నా, లేకపోయినా.. కరోనా నిర్దారణ పరీక్షలు చేసేందుకు ఇంకా ఎక్కువ సంఖ్యలో టెస్టు కిట్లను అమర్చుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందు ముందు ఎదుర్కొనబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పరీక్ష కిట్లతోపాటు ఇతర వైద్య సామగ్రి, బెడ్లను సిద్ధం చేసుకుంటే.. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని.. అంటున్నారు.