ఎస్ఎల్బీసీ టెన్నెల్ 8 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం.తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన రాజకీయ ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. పదేళ్ల పాటు అధకారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ సకాలంలో ప్రాజెక్ట్ ని పూర్తి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటూ అధికార పక్షం ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇంతటి ఘోరం జరిగిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ అనే సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆ పిల్లో పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజులు గడుస్తున్నా.. సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు పిల్పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసిందని కోర్టుకు వినిపించారు.