కరోనా లాక్‌డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో ఐటీ రంగం కూడా ఒకటి. అయితే చాలా వరకు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో కొంత వరకు కంపెనీలు నష్టాల నుంచి బయట పడ్డాయి. కానీ మెజారిటీ ఉద్యోగులు మాత్రం పనిచేయలేకపోయారు. దీంతో ఆయా కంపెనీలకు నష్టాలు తప్పలేదు. అయితే కంపెనీలు ఇకపై వ్యయాన్ని తగ్గించుకునేందుకు గాను.. 50 శాతం మంది ఉద్యోగులను పర్మినెంట్‌గా ఇంటి నుంచే పనిచేయించనున్నట్లు తెలిసింది.
అయితే ఉద్యోగులను ఇళ్ల నుంచి నిత్యం 8 గంటల పాటు పనిచేయించాలంటే.. లేబర్ చట్టాల ప్రకారం రూల్స్‌ను మార్చాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పలు ఐటీ సంస్థలు ఈ విషయమై ఇప్పటికే సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశాయి. ఇక ఆ చట్టాలు మారి ఉద్యోగులు ఇళ్లకే పరిమితమై పనిచేస్తే.. వారు ఈపీఎఫ్‌వోకు బదులుగా ఎన్‌పీఎస్ ను తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆఫీసుల్లో ఉన్నన్ని సదుపాయాలు ఉద్యోగులకు నిజంగా ఇళ్ల వద్ద ఉండవు. ఈ క్రమంలో ఈ ఇబ్బందిని అధిగమించేందుకు కూడా ఐటీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
ఇంటి వద్ద ఉండి ఉద్యోగులు పనిచేయాలంటే వారికి విద్యుత్, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సదుపాయాలను పక్కాగా అందుబాటులో ఉంచాలి. అలాగే ఇంట్లో ఉద్యోగులు పనిచేసుకునేందుకు అవసరమైన వర్క్ ప్లేస్‌ను వారే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో కంపెనీలతో వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాంటాక్ట్‌లో ఉండవచ్చు. అలాగే పని కూడా చేసుకోవచ్చు. ఇక ఈ విషయంపై ఐటీ కంపెనీలు కూడా ప్రస్తుతం దృష్టి సారించాయి.
ప్రముఖ కన్సల్టెన్సీ కంపెనీ టీసీఎస్ 2025 వరకు తన ఉద్యోగుల్లో 75 శాతం మందిని ఇండ్ల వద్ద నుంచే పనిచేయించాలని చూస్తోంది. అలాగే టెక్ మహీంద్రా తన ఉద్యోగుల్లో 25 శాతం మందికి వర్క్ ఫ్రం హోం ఇవ్వనుంది. దాన్నికొంత కాలానికి 50 శాతం చేయనున్నారు. ఇక మరో కంపెనీ హెచ్‌సీఎల్ కూడా తమ ఉద్యోగుల్లో 50 శాతం మందిని పర్మినెంట్‌గా ఇంటి నుంచి పనిచేయించాలని చూస్తోంది. అయితే లేబర్ చట్టాలను మారిస్తేనే.. కంపెనీలకు ఇలా వర్క్ ఫ్రం హోంను పర్మినెంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఆ చట్టాలను కేంద్ర ప్రభుత్వం మార్చే వరకు వేచి చూడాలి..!