డేటా సేవల్లో మరింత వేగం పెంచేందుకు వీలుగా 5జీ స్పెక్ట్రమ్ త్వరలనే అందుబాటులోకి రానుంది. 4జీ తో పోలిస్తే 10 రెట్లు వేగవంతంగా డేటా సేవలు అందించే 5జీ స్పెక్ట్రమ్ వేలం ఇవాళ ప్రారంభం కానుంది. టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా ఇందులో పాల్గొననుంది.
ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీలు పాల్గొంటుండటంతో ఈ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమ సొంత అవసరాల (క్యాప్టివ్) నెట్‌వర్క్ కోసం స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునేందుకు టెక్ సంస్థలకు అనుమతినివ్వడం ఈ సారి వేలంలో ప్రత్యేకతగా చెప్పొచ్చు.
ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు సంస్థలు బిడ్‌లు దాఖలు చేయొచ్చు. టెలికాం సంస్థల వ్యూహాలకనుగుణంగా స్పెక్ట్రమ్ కోసం వేసే బిడ్లను అనుసరించి, వేలం కొనసాగుతుంది. దాదాపు రెండురోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. స్పెక్ట్రమ్ కోసం నిర్ణయించిన కనీస ధర సమీపంలోనే, బిడ్లు ఖరారయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.