తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోనే కాకుండా ఎగువ రాష్ట్రాల్లో సైతం వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళా రాష్ట్రంలో వరదలు సంభవించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. తాజాగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ, పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగింది.ప్రస్తుతం జలాశయానికి 45వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఏడుగేట్ల ఎత్తి 45వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఇప్పటికే జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండింది.
డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు, ప్రస్తుతం 1,088 అడుగుల మేర నీరున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. జలాశయంలో 77 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని పది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణతో పాటు ఏపీలో సైతం మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.