హైదరాబాదులోని చర్లపల్లిలో రూ.430 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అధునాతన రైల్వే టెర్మినల్‌ను కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పరిశీలించారు. గత రెండు పర్యాయాలుగా రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ క్రమంలోనే రైల్వే టెర్మినల్ పనులను ఆయన పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు పంపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం చర్లపల్లిలో కిషన్‌రెడ్డి పర్యటించారు. రైల్వే టెర్మినల్‌లో పూర్తి అయిన పనులను పరిశీలించారు. ఇంకా పూర్తి కావాల్సిన పనులపై ఇంజినీర్లు, ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ..కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు 95 నుంచి 98 శాతం పుర్తయ్యాయని చెప్పారు. త్వరలోనే పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ అవుతాయన్నారు. పనులు పూర్తి కాగానే ప్రధాని మోడీ చేతుల మీదుగా చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.