ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..కొందరు అంబేడ్కర్‌ను ఓ వర్గానికి చెందిన నేతగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనే మంచి ఆలోచన చేశారని, పరిపాలన సౌలభ్యం కోసం ఆయన ముందు చూపుతో అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగ స్పూర్తితో మాజీ సీఎం కేసీఆర్ పాలన అందించారన్నారు. దళిత బంధును అందకే తీసుకొచ్చారని వివరించారు.
ఎన్నికల సమయంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని అన్నారు. కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లను ఎప్పుడు అమలు చేస్తారని అడిగారు.సీఎం రేవంత్ చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని నాయకుడిని పదవి నుంచి తొలగించాలనే రూల్ అంబేడ్కర్ రాయలేదని.. ఆయనకు అప్పట్లో ఇలాంటి వాళ్ల గురించి తెలియదని ఘాటు విమర్శలు చేశారు.