అగ్రరాజ్యం అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో భారీ భూ ప్రకంపనలు వచ్చాయి. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10.44 ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించినట్లుగా అమెరికా ల్యాండ్ సర్వే విభాగం అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే సెస్మాలజీ నిపుణులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కోకు 418 కి.మీ దూరంలో ఫెర్న్‌డేల్ పట్టణంలో భూ ప్రకంపనల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.అదేవిధంగా పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి.భూకంపం ప్రభావంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. కాగా, భూకంపం రావడంతో ఉత్తర కాలిఫోర్నియా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.