సంక్రాంతి పండుగను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాక్యలు చేశారు. ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. గంగిరెద్దులు.. హరిదాసులు.. భోగిమంటలు.. పిండివంటల సమ్మేళనమే సంక్రాంతి.
అటువంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయి. ఇది ప్రజలకు పండుగపై ఉన్న మక్కువను తెలియజేస్తున్నది. ఉపాధి కోసం పల్లె బిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు జనాలు లేక కొంతవరకు పలుచబడ్డాయి. సంక్రాంతి వేళ పల్లెలు పిల్లాపాపలతో కళకళలాడుతుంటే చూసేందుకు సంతోషంగా ఉంది.పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. ఆనందాలు, సిరిసంపదలతో సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని డిప్యూటీ సీఎం రాసుకొచ్చారు.