ఒడిశాలోని ఓ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడల్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్లో జరుగుతున్న వార్షిక క్రీడోత్సవాల్లో ప్రమాదవశాత్తు ఓ జావెలిన్ (ఈటె) 9వ తరగతి విద్యార్థి మెడలోంచి దూసుకెళ్లింది. ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిందీ ఘటన. తీవ్రంగా గాయపడిన బాధిత బాలుడు సదానంద మెహర్ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అగల్‌పూర్ బాయ్స్ హైస్కూల్‌లో ఓ విద్యార్థి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తుండగా అది ప్రమాదవశాత్తు మెహర్ మెడ కుడివైపు నుంచి దూసుకెళ్లి ఎడమవైపునకు వచ్చింది.
బాధిత బాలుడిని వెంటనే అలాగే బలంగీర్‌లోని భీమా భోయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ జావెలిన్‌ను విద్యార్థి మెడ నుంచి సురక్షితంగా బయటకు తీశారు. మెహర్‌కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. స్కూల్‌లో స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని, బాలుడి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని బలంగీర్ కలెక్టర్ చంచల్ రాణా తెలిపారు. అలాగే, బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 30 వేలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఈ ఘటనపై స్పందించారు. బాలుడికి మరింత మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన నిధుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఉపయోగించాలని సూచించారు.