సిఏఏ చట్టం ప్రకారం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం

-

లోక్‌సభ ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం-2019 అమలు ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్నవారికి తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా తెలిపారు. ఢిల్లీలో వారికి సీఏఏ కింద జారీ అయిన పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు.

కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ అమలుపై ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం-2019 పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందగా.. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. సీఏఏ చట్టం ప్రకారం.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్రం నిబంధనల్ని రూపొందించింది. కాగా, ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version