తాను మంత్రి పదవీ వదులుకోవడం లేదు.. స్పందించిన నటుడు సురేష్ గోపి

-

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ 3.0 ప్రభుత్వం ఆదివారం ఏర్పడింది. మొత్తం 72 మంది ఎంపీలు కేబినెట్ మంత్రులుగా, కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గత రెండు పర్యాయాలు లేని విధంగా ఈసారి ఎక్కువమంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఎన్డీఏ మంత్రివర్గంలో చేరారు. దక్షిణాదిన తొలిసారిగా కేరళలో బీజేపీ ఒక ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది. త్రిసూర్ నియోజకవర్గం నుంచి నటుడు సురేష్ గోపి గెలుపొందారు. దాంతో మోడీ కొత్త ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది.

తాజాగా ఆయన మంత్రి పదవి వద్దన్నారని, ఎంపీగా మాత్రమే ఉంటానని ప్రకటించినట్టు కథనాలు వెలువడ్డాయి. త్వరలోనే మంత్రి పదవి నుంచి రిలీవ్ అవుతానని అనుకుంటున్నట్లు, ఎంపీగా నేను త్రిసూర్ ప్రజల కోసం పనిచేస్తానని, ఇప్పటికే సైన్ చేసిన సినిమాలను ఎలాగైనా పూర్తి చేయాల్సి ఉందని’ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎంపీ సురేష్ గోపి ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘తాను కేంద్ర మంత్రి పదవి వద్దన్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రధాని మోడీ నాయకత్వంలో కేరళ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు’ ఆయన స్పష్టం చేశారు.  ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కేరళ నుంచి బీజేపీకి తొలిసారి ఒకే ఒక విజయం దక్కింది. త్రిసూర్ నుంచి పోటీ చేసిన సురేష్ గోపి 74,686 ఓట్ల తేడాతో విజయం సాధించి బీజేపీకి చరిత్రలో తొలి విజయాన్ని అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version