లాక్‌డౌన్ ఎత్తేశాక‌.. ప్ర‌తి ఒక్క‌రూ తీసుకోవాల్సిన ముఖ్య‌మైన జాగ్రత్త‌లివే..!

-

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు విధించిన దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ముగిసేందుకు మరో 4 రోజుల గ‌డువు మాత్ర‌మే ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ గడువు ముగిశాక‌.. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల వ‌ర‌కు పొడిగించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక లాక్‌డౌన్ ఎత్తేశాక మాత్రం ఇంత‌కు ముందు ఉన్న సాధార‌ణ ప‌రిస్థితులు మాత్రం ఉండ‌బోవ‌ని.. ప్ర‌జ‌లు అందుకు సిద్ధంగా ఉండాల‌ని.. వైద్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

* లాక్‌డౌన్ ఎత్తేశాక ఒకేసారి ప్ర‌జ‌లంద‌రూ రోడ్ల మీద‌కు రావ‌డం అంటూ జ‌ర‌గ‌దు. ప్ర‌ధాని మోదీ చెప్పిన‌ట్లు లాక్‌డౌన్‌ను ద‌శ‌ల‌వారీగా ఎత్తేస్తారు. కరోనా హాట్‌స్పాట్‌ల‌లో ఆంక్ష‌లు అలాగే ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తారు. కొంత కాలానికి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేస్తారు. అయిన‌ప్ప‌టికీ అప్పుడు కూడా ఇంత‌కు ముందు ఉన్న ప‌రిస్థితి ఉండ‌దు.

* లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేశాక ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌గా ఉండాలి. కరోనా అంత‌మైనా.. వ్య‌క్తిగత ప‌రిశుభ్ర‌త చాలా ముఖ్యం. చేతుల‌ను త‌ర‌చూ శుభ్రంగా క‌డుక్కోవాలి. అలాగే భోజ‌నం చేయ‌డానికి ముందు, టాయిలెట్‌కు వెళ్లి వ‌చ్చాక‌.. చేతుల‌ను క‌చ్చితంగా స‌బ్బుతో క‌డుక్కోవాలి.

* లాక్‌డౌన్‌ను పూర్తి తీసేసినా.. కొన్ని నెల‌ల వ‌ర‌కు ప్ర‌జ‌లు బ‌య‌ట తిరిగిన‌ప్పుడు క‌చ్చితంగా మాస్కులు ధ‌రించాలి. అలాగే సామాజిక దూరం పాటించాలి.

* బ‌హిరంగ ప్ర‌దేశాల్లో వీలైనంత వ‌ర‌కు ఉండ‌కూడ‌దు. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌దు. వెళ్లినా.. సొంత వాహ‌నాలు అయితే మంచిది. ప్రజా ర‌వాణా ఉప‌యోగించ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

* ప్ర‌జ‌లు ఎక్కువ‌గా గుమి గూడే ప్రాంతాల‌కు దూరంగా ఉండాలి. కుటుంబం నుంచి ఒక్క‌రే బ‌య‌ట‌కు వెళ్లి అవ‌స‌రం ఉన్న నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు తెస్తే మంచిది.

* ఇంటిని, ఇంటి ప‌రిసరాల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. రసాయ‌న ద్రావణాలు లేదా బ్లీచింగ్ పౌడ‌ర్‌తో ప‌రిస‌రాల‌ను శానిటైజ్ చేసుకోవాలి.

* పిల్ల‌లు, వృద్ధులు ఉన్న ఇంట్లో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. వారిని బ‌య‌ట‌కు రానీయ‌కూడ‌దు.

* ప్ర‌జా ర‌వాణాను ఆశ్ర‌యించాల్సి వ‌స్తే.. సామాజిక దూరం పాటించాలి. బ‌స్ స్టాండ్లు, రైల్వే స్టేష‌న్లు, ఎయిర్‌పోర్టులు త‌దిత‌ర ప్రాంతాల్లో సామాజిక దూరం కొన‌సాగాలి.

* లాక్‌డౌన్‌ను పూర్తిగా తీసేశాక‌.. స్కూళ్ల‌కు పిల్ల‌లు వెళ్లాల్సి వ‌స్తే.. వారిని పెద్ద‌లే స్వ‌యంగా స్కూళ్ల వ‌ద్ద దింపాలి. బ‌స్సుల్లో పంప‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం. అలాగే.. స్కూల్‌లోనూ తోటి విద్యార్థుల నుంచి దూరంగా ఉండ‌మని పిల్ల‌ల‌కు చెప్పాలి. కాలేజీల్లోనూ ఇలాగే నిబంధ‌న‌ల‌ను పాటించాలి. విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేయాలి.

* బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌రుగుదొడ్ల వ‌ద్ద స‌హ‌జంగానే అప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. అలాంటి చోట్ల శానిటైజేష‌న్ ప‌నులు ప‌క‌డ్బందీగా చేప‌ట్టాలి. వైర‌స్ వ్యాప్తి చెంద‌డానికి ఆస్కారం ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక‌.. మ‌రుగుదొడ్ల శుభ్ర‌త విష‌యంలో నిర్వాహ‌కులు మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి.

* ప‌నిచేసే చోట సామాజిక దూరం పాటించేలా కంపెనీలు చొర‌వ తీసుకోవాలి. ఆఫీసులు, వ్యాపారాలు, ప‌రిశ్ర‌మ‌ల్లో శానిటైజేష‌న్ చేయాలి. ఉద్యోగులు, కార్మికుల‌కు చేతుల‌ను శుభ్రం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలి. అలాగే త‌గిన‌న్ని టాయిలెట్స్ ఉండేలా చూడాలి.

లాక్‌డౌన్ ఎత్తేశాక‌.. ప్ర‌తి ఒక్క‌రూ పైన తెలిపిన జాగ్ర‌త్త‌ల‌న్నింటినీ పాటించాలి. లేదంటే.. త‌గ్గిపోయిన మ‌హ‌మ్మారి మ‌ళ్లీ తిర‌గ‌బెట్ట‌వ‌చ్చు. అయితే లాక్‌డౌన్‌ను పూర్తిగా తీసేశాక‌.. ప్ర‌భుత్వాలు ఎలాగూ ఈ జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని క‌చ్చితంగా సూచిస్తాయి. క‌నుక‌.. అంద‌రూ ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే.. ఆరోగ్యాల‌ను కాపాడుకోవ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version