హైదరాబాద్ లో గత కొద్ది రోజుల నుండి భూ ప్రకంపనలు టెన్షన్ పెడుతున్నాయి. ముందు బొరబండ, మొన్న గచ్చిబౌలిలో ఈ ప్రకంనలు స్థానికులకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. తాజాగా హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ సర్కిల్ సులేమాన్ నగర్, చింతల్ మెట్, పహడీ, ప్రాంతాలలో అర్ధరాత్రి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఖంగు తిన్నారు. ఈ ప్రకంపనల దెబ్బకు ఇంట్లో నుండి జనం బయటికి పరుగులు తీశారు.
గతంలో కూడా ఇదేవిధంగా భారీ శబ్దాలు వచ్చాయి అంటున్నారు స్థానికులు. అయితే హైదరాబాద్ లో ప్రకంపనల గురించి ఇప్పటికే అధికారులు క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ కు భూకంపాలు రావని మేము ఎప్పుడు చెప్పలేదని, కానీ తీవ్ర భూకంపాలు మాత్రం రావని చెప్పగలమంటున్నారు. బోరబండ, గచ్చిబౌలి ఎన్జీవోస్ కాలనీల్లో భూకంపం వచ్చిన మాట వాస్తవమేనని, భూమి పొరల్లో వచ్చిన వత్తిడి, పగుళ్ల వల్లే భూమి కంపించిందని నిన్న పేర్కొన్నారు. ఇష్టానుసారంగా బోర్లు వేయడం, భూమి లోపల నీటి ఆనవాళ్లు లేకపోవడంతో భూమిలో పొరలు కదులుతున్నాయని వారు చెబుతున్నారు.