ఏపీలో చంద్రబాబు నాయుడు పార్టీని కాపాడుకోవడమే కాదు, బ్రతికించుకోవడంలో కూడా చాలా బిజీగా ఉన్నారు. కాని ఆయనకు ఆయన నిర్ణయాలే ప్రధానంగా ఇబ్బందిగా మారాయి అనేది విశ్లేషకులు అనే మాట. అసలు ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు…? ఆయనను అవి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి…? రెండు పదవులు బాబుని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, తెలుగు యువత అధ్యక్ష పదవి. ఈ రెండు పదవులు పార్టీని ముందుకు నడిపించడానికి చాలా కీలకం కానున్నాయి.
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని ఎంపిక చేసే సూచనలు ఉన్నాయని అన్నారు. కాని ఆయన ఆ పదవికి సిద్దంగా లేరు కాబట్టి కోస్తా ప్రాంతానికి చెందిన మరో నేతను ఎంపిక చేసే అవకాశం ఉండవచ్చు అని చెప్పారు. ఆయన కాదు రాయలసీమకు చెందిన ఒక నేత పేరు పరిశీలనలో ఉందని అన్నారు. ఆయన కూడా కాదు మరో నేత అని చెప్పారు. బాలకృష్ణ ఆపడంతో పదవి ప్రకటన ఆగింది అని అన్నారు. కాని ఇప్పుడు ఆ పదవి దెబ్బకు పార్టీలో సీనియర్లు అందరూ కొట్టుకునే పరిస్థితి వచ్చింది.
ఎర్రన్న కుటుంబం ఎన్ని పదవులు అనుభవిస్తుంది అని సిక్కోలు నేతలే అనేస్తున్నారు. దీనితో ఆయన ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త పడింది పార్టీ అధిష్టానం. ఇక తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆ పదవిలో ఎవరిని ఎంపిక చేస్తారో తెలియడం లేదు. ఆ పదవి గోల పక్కన పెట్టి తెలుగు యువత పదవి విషయానికి వస్తే… ఎవరికి పదవి ఇవ్వాలో చంద్రబాబుకి అర్ధం కాక అంతిమంగా పార్టీలో యువనేతలు గుడ్ బై చెప్పేస్తున్నారు. పదవి కోసం ఎదురు చూసిన విశాఖ జిల్లా నేత ఒకరు పదవి రాకపోయేసరికి వద్దులే అని మంత్రితో ఫ్రెండ్ షిప్ చేయడం మొదలు పెట్టారు.
దేవినేని అవినాష్ ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎవరిని ఎంపిక చేయాలో పార్టీ అధిష్టానానికి కూడా అర్ధం కావడం లేదు. పార్టీ అగ్ర నేతలు కూడా ఈ పదవి విషయంలో కసరత్తు గట్టిగా చేస్తున్నారు. అయినా సరే పదవికి సరైన నేత దొరకడం లేదని కొందరు అంటున్నారు. జేసి పవన్ రెడ్డి సహా చాలా మంది ఆ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అయినా సరే బీసీ అయితే బాగుంటుంది అని భావించారట. అయితే కొందరు సీనియర్లు ఏమో… బీసీ నేతకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి తెలుగు యువత కూడా ఇస్తే మరి రెడ్ల సంగతి ఏంటి…? అని అడిగేశారు.