ట్రంప్‌ భారత్‌కు వస్తున్నారని.. మురికి వాడలు కనిపించకుండా గోడలు కడుతున్నారు..!

-

విదేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు.. వచ్చినప్పుడు భారత్‌లో వారు సందర్శించే ప్రాంతాలను ముందుగానే అందంగా అలంకరిస్తారు. ఇది కొత్తేమీ కాదు. ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో భారత్‌ రానున్న నేపథ్యంలో ఆయన సందర్శించనున్న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, న్యూఢిల్లీ ప్రాంతాలను ఇప్పుడు సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ట్రంప్‌ వెళ్లనున్న రహదారుల్లో మురికి వాడలు ఆయనకు కనిపించకుండా ఉండేందుకు గాను రోడ్లకు ఇరువైపులా ఏకంగా 6-7 అడుగుల ఎత్తున్న గోడలను నిర్మించనున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరి 24వ తేదీన రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు. ఈ క్రమంలో ఆయన అహ్మదాబాద్‌, న్యూఢిల్లీ ప్రాంతాల్లో ప్రధాని మోదీతో కలిసి పర్యటించనున్నారు. ఇక అహ్మదాబాద్‌లోని మోతెరాలో నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియాన్ని ఇరువురూ ప్రారంభించనున్నారు. అయితే అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సదరు స్టేడియం వరకు ఉన్న రోడ్డును ట్రంప్‌ పర్యటన నిమిత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో రోడ్ల మరమ్మత్తు, అలంకరణ పనులకు గాను రూ.50 కోట్లకు పైగానే అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఖర్చు చేయనుంది.

అయితే అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సదరు స్టేడియం వరకు ఉన్న రహదారిలో మార్గ మధ్యలో ఒక చోట శరనియవస్‌ అనే మురికి వాడ ఉంది. అక్కడ సుమారుగా 500 ఇండ్లు ఉంటాయి. 2500 మంది జనాభా ఆ మురికి వాడలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో రహదారి నుంచి చూస్తే ఆ మురికివాడ కూడా కనిపిస్తుంది. అయితే ఆ మురికి వాడ కనిపించకుండా ఉండేందుకు గాను రహదారికి ఇరువైపులా సుమారుగా 600 మీటర్ల పొడవున 6-7 అడుగుల ఎత్తున్న గోడలను నిర్మించనున్నారు. ట్రంప్‌ ఆ దారిలో వెళ్లనుందున అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రస్తుతం అక్కడ గోడలను నిర్మించే పనిలో పడింది.

ఇక అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మోతెరా కొత్త స్టేడియం వరకు రహదారిపై అలంకరణకు గాను రూ.2 కోట్ల వ్యయంతో సుమారుగా 1.50 లక్షల పువ్వులను వినియోగించనున్నారని తెలిసింది. అలాగే రూ.1 కోటి వ్యయంతో లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే కేవలం తాత్కాలిక అవసరం కోసం అంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకని, అదే డబ్బును ఇతర ముఖ్యమైన అవసరాలకు ఉపయోగించవచ్చు కదా… అని పలువురు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా.. మన నాయకులకు మన బండారం బయటపడి ఇతర దేశాల వారికి తెలుస్తుందని ఎంత భయమో కదా.. ఆ భయం వారిలో ఎప్పుడూ ఉంటే.. ఈ పాటికి ఇండియా ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version