కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి రాష్ట్రంలోనూ మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పట్ల అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరింత సీరియస్‌గానే వ్యవహరించనుంది. సోమవారం నుంచి అక్కడ మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేశారు. అయితే ఈ నిబంధనను అతిక్రమించిన వారికి భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు.
అహ్మదాబాద్‌లో ఇకపై పౌరులు ఇంటి నుంచి కాలు బయటకు పెడితే.. మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సిందే. ఎవరైనా మాస్కు లేకుండా కనిపిస్తే.. రూ.5వేల భారీ జరిమానా లేదా.. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఈ మేరకు అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా మాట్లాడుతూ.. పౌరులు ఎవరైనా మాస్కులు లేకుండా బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలను పాటించని వారికి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తామన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారమే.. ఈ రూల్స్‌ను అమలులోకి తెచ్చామన్నారు.
కాగా గుజరాత్‌లో ఇప్పటి వరకు 366 వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. 22 మంది చనిపోగా.. 44 మంది రికవరీ అయ్యారు.