కార్తీక మాసం వచ్చిందంటేనే ఎక్కడలేని పవిత్రత, ఆధ్యాత్మికత. ఈ మాసంలో ఆలయాల్లోని ధ్వజస్తంభంపై వెలిగించే ‘ఆకాశ దీపం’ దర్శనం అత్యంత విశేషమైనది. పురాణాల ప్రకారం, ఈ దీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుంది. ముఖ్యంగా ‘కైలాస ఆకాశ దీపం’ దర్శనం చేస్తే కోటి పుణ్యాలు లభిస్తాయని జీవితంలోని పాపాలన్నీ తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతోంది. ఆకాశంలో ధ్రువతార వైపు వెలిగించే ఈ పవిత్రమైన దీపం యొక్క అద్భుతమైన ప్రాముఖ్యత మరియు దాని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం.
కార్తీక మాసంలో దేవాలయాల్లో ధ్వజస్తంభానికి వేలాడదీసే ఆకాశ దీపాన్ని కైలాస దీపం అని కూడా వ్యవహరిస్తారు. ఈ మాసంలో పితృ దేవతలందరూ ఆకాశ మార్గాన తమ లోకాలకు ప్రయాణిస్తారని, వారికి దారి చూపడానికి ఈ దీపాన్ని వెలిగిస్తారని కార్తీక పురాణం చెబుతోంది. ఈ దీపం కేవలం వెలుగును మాత్రమే కాదు, శివ కేశవుల యొక్క తేజస్సును భూలోకానికి అందిస్తుంది.

ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకున్నా, దీపంలో నూనె పోసినా, ఆరాధించినా అపారమైన పుణ్య ఫలం లభిస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే నాల్గవ సోమవారం నాడు కైలాసంలో ఆకాశ దీపం సంబరాలు జరుగుతాయని ఆ రోజున ఈ దీపాన్ని దర్శించుకుంటే కోటి పుణ్యాలతో పాటు, వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేసినంత ఫలితం దక్కుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
కార్తీక మాసం లో ఆకాశ దీపం దర్శనం తో తెలియక చేసిన పాపాలు, అజ్ఞానం, అవివేకం తొలగిపోతాయని, పితృ దేవతలు కూడా సంతోషిస్తారని నమ్మకం. ఈ ఆకాశ దీపం వెలుగు మన జీవితాల్లోని అజ్ఞానపు చీకట్లను తొలగించి, జ్ఞానాన్ని, సానుకూలతను నింపి, శివకేశవుల అనుగ్రహాన్ని అందిస్తుంది. అందుకే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆకాశ దీప దర్శనాన్ని భక్తిశ్రద్ధలతో చేసుకుని, పుణ్యఫలాన్ని పొందుతారు.
