ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ విడుదల కావాల్సిన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ నిధులకు బ్రేక్ పడింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ‘అసని’ తుఫాన్ వల్ల సంభవిస్తున్న ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేడు కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో నిర్వహించతలపెట్టిన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది.
ఈ కార్యక్రమాన్ని మే 13కు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది ఏపీ సర్కార్. కాగా.. తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడిన ‘అసని’.. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 60 కి.మీ., కాకినాడకు 180 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 550 కి.మీ., పూరీకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది.